సమర్పణ ప్రార్థన - 1

 1. అతి పరిశుద్ధుడవైన తండ్రీ! నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికిని, వారు పాపములో పడిపోవుటవలన వారినిబట్టి మాకందరికి పాపము ప్రవేశించినది. ఓ తండ్రీ! పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. గానీ పాపములేకుండా ఉండలేక పోవుచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవుచున్నాను, మరల నీ యెదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర, నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగియున్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత, నీ పరిశుద్ధత ఎదుట తక్కువై యున్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై యుండగలము? నీవు క్షమించుటనుబట్టిగాని, లేనియెడల నేను ఇదివరకే నశించి యుండవలసినదే. నా ప్రభువా! నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి, పాపము ప్రవేశించినప్పుడెల్ల విసర్జింప పూనుకొనియున్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, 'ఓ సైతానా! ఇది నీ పని. నా మీద నీకు ఏ అధికారములేదు, వెళ్లిపో' అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను.

2. దేవా! పాపము ఒక్కటే కాదు. పాపము ప్రవేశించి ఊరుకొనుటలేదు, అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలిసికొని, క్షమాపణకోరి, స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన యెడల ప్రార్థించి, నీ దీవెనతో ఔషదము వేసికొందును. నీళ్లను ఔషదముగా నీవు నయమాను విషయములో వాడినావుకదా! నరుడు పాపములో పడిపోవుననియు, అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి, మూలికాదులు పుట్టించి; అవి ఔషదములుగా వాడుకొను జ్ఞానమును కొందరికిచ్చి, ఔషదములు చేయించుచు అనేకమందిని బాగుచేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందులేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలెనని నీ నామధారుల విషయములో కోరుచున్నావు.

3. తండ్రీ! పాపము వలననే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలగుట సంభవించుచున్నది. ఇట్టిది నాకు కలిగిన యెడల విశ్వాస మూలముగానే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.

4. ఈ అవస్థలు కాక ఇంకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయములో ప్రార్థనవలననే తొలగించుకొనుటకు పూనుకొన్నాను.

5. పాపమునుబట్టి మరియొక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్ధము చేసికొనుట, నీ నిశ్శబ్ధమును గ్రహింపలేకపోవుట; సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక, నిన్నుబట్టి భయములను నివారణ చేసికొనుటకు పూనుకొన్నాను.

6. పాపపరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసినవన్నియు, మోక్షభాగ్యము దయచేయుదువనియు మరియు నీ వాక్యములో వ్రాయించిన వాగ్దానములన్నియు నమ్ముటకై పూనుకొన్నాను. ముఖ్యముగా యోహాను 14:14లో నున్న వాగ్ధానము, మార్కు 11:24లో నున్న సలహాను నమ్ముటకు పూనుకొన్నాను.

7. పరిశుద్ధాత్మ దేవా! నేను పరిశుద్ధుడనైయున్నట్లు, నీవును పరిశుద్ధుడవై యుండుమని సెలవిచ్చినదేవా! నీకనేక స్తోత్రములు. ప్రతి పాపమునుండి నన్ను దూరపర్చుము. శోధనలోనికి నన్ను రానీయకుము. నాకు తెలిసిన ప్రతి పాపమునుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను. నిన్ను మరచియుండుట, నీ మీద విసుగుకొనుట, నీ యెడల కృతజ్ఞత లేకుండుట, ఆరాధనకు వెళ్లుటలో నిర్లక్ష్యము కలిగియుండుట, పెద్దల యెడల అమర్యాదగా నడచుట, కొట్టుట, స్త్రీ పురుషుల యెడల దుర్వాంఛ కలిగియుండుట, ఒకరిది ఆశించుట, అపహరించినది తిరిగి ఇవ్వకుండుట, ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి, అల్లరిచేసి పేరు చెడగొట్టుట, అబద్ధములాడుట, తగని రీతిగా కోపపడుట, ఒకరిని ద్వేషించుట తిట్టుట, కుట్రాలోచనలు చేయుట, ఊరుపేరు లేని వ్రాతలు వ్రాయుట, ఇతరుల పాపములలో పాలివారగుట; ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను.

8. కష్టకాలము వచ్చినప్పుడు అదికూడ మేలుకొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యధాప్రకారమైన వాడుకలు చేయుటకును, మేలుచేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగియుండుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును, నీ గ్రంధములోని సంగతులు నేర్చుకొనుటకును, నా కొరకు, అందరికొరకు ప్రార్థించుటకును, కీర్తనలు పాడుటకును, ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, బీదలకు ధర్మము చేయుట, జీవరాసుల యెడల దయగా నుండుట, ప్రతి అవసరమైన పనుల సమయములలో వెంటనే ప్రార్థనచేయుట, భోజన సమయమందు, నీళ్ళు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్థించుట కుటుంబ ప్రార్థన చేసికొనుట; రాత్రులందు మెళకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట; ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండ జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్ధమై నేను చేయవలసిన పనులలో, ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను.

9. 1) దేవా! నీ చిత్తమే నా చిత్తము. నీ చిత్తమునకు వ్యతిరేకముగా నున్నప్పుడు నా చిత్తమును కొట్టివేసికొందును.

2) దేవా! ఒకచోటికి వెళ్ళుమని నీవు నాతో చెప్పునప్పుడు, నా మనస్సులో ఇష్టము లేకపోయినను మరియు నాకు శక్తి, వీలులేకపోయినను, ఏమియు మాటలాడకుండా అబ్రాహామువలె వెళ్ళుటకు పూనుకొన్నాను.

3) దేవా! ఒక కష్టమైన పని నీవు నాకు అప్పగించి తప్పకుండా చేయుమని చెప్పినయెడల నాకు దిగులు పుట్టినప్పటికిని, ఇష్టము లేనప్పటికిని ఆ పనిచేయుటకై పూనుకొన్నాను.

4) దేవా! నాకు ఇష్టములేని మనిషితో, నీవు చెప్పే మాటలు అతనికి చెప్పుటకు వెళ్ళుమని నీవు ఆజ్ఞ ఇచ్చిన యెడల, నాలో పిరికితనము పాతుకొని యున్నప్పటికిని అతనితో మాట్లాడుటకు పూనుకొన్నాను.

5) దేవా! మరియొక మనిషియొద్దకు వెళ్ళి, నన్ను గురించి సాక్ష్యమిమ్మని నీవు నాతో చెప్పినయెడల, ఏమి చెప్పవలెనో నాకు తెలియనప్పటికిని నేను వెళ్ళుటకు పూనుకొన్నాను.

6) దేవా! 'అడవి మృగములున్న వనముదాటి అవతలనున్న గ్రామము మధ్యను నిలిచి బోధించుము' అని నీవు చెప్పిన యెడల, నిర్భయముగా వెళ్ళుటకు పూనుకొన్నాను.

7) దేవా! 'అస్సాము దగ్గరనున్న నాగ కొండలలో నివసించుచున్న నరమాంస భక్షకులయొద్దకు వెళ్ళి బోధించుమని' నీవు చెప్పిన యెడల ప్రశ్న వేయకుండా వెళ్ళి, అట్లు చేయుటకు పూనుకొన్నాను. (బలమిస్తే వెళ్ళుదును అని అనను).

8) దేవా! 'భాష ఎరుగని దేశమునకు నిన్ను పంపుదును' అని నీవు నాతో అన్నట్లయిన ఏమియు తిరుగుచెప్పక, వెళ్ళి ప్రసంగించుటకు పూనుకొన్నాను.

9) దేవా! 'ఒక దేశమునకు నీవు సువార్త పనిమీద వెళ్ళుము. అక్కడవారు నిన్ను బళ్ళెములతో పొడిచి చంపివేయుదురు' అని నీవు చెప్పిన యెడల నేను ముస్తాబై వెళ్ళుటకు పూనుకొన్నాను. (హతసాక్షి కిరీటము వచ్చును).

10) దేవా! వెళ్ళి ఆ కొండమీద 40 దినములు ఉపవాసము చేయుముఅని నీవు నాతో చెప్పినప్పుడు, అంతకన్న భాగ్యమున్నదాఅని చేయుటకు పూనుకొన్నాను.

11) దేవా! నాకు ప్రియమైన ఒకరు చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు, బ్రతికించే ప్రార్ధనలు ఎందరు చేసినను, నీవు విననప్పుడు; నేను ఆనందించి స్తుతించుటకు పూనుకొన్నాను.

12) దేవా! నా చేతిలో పైసాయైనను లేనప్పుడు నీవు నన్నుచూచి, రేపు పేదలకు సంతర్పణ చాటించుమని చెప్పిన యెడల, అట్లు చేయుటకు పూనుకొందును.

13) దేవా! అసాధ్యమైన ఏ పని నీవు నాకు చెప్పినను, నేను చేయనని అనకుండుటకు పూనుకొన్నాను.

14) (1) దేవా! యేసుక్రీస్తునందు పురుషుడనియు, స్త్రీ అనియు బేధములేదని నీ వాక్యములో వ్రాయబడియున్నది గనుక నాకొక పరిచయ శక్తి దయచేయుము. అదేదనగా నాకంటే చిన్నవారైన బాలికలను చెల్లెండ్రుగాను, పెద్దవారైన బాలికలను అక్కలనుగాను, చిన్నవారైన బాలురను తమ్ములనుగాను; పెద్ద బాలురను అన్నలుగాను; పెద్ద స్త్రీలను తల్లులుగాను; పెద్ద పురుషులను తండ్రులుగాను భావించుకొనుటకు పూనుకొన్నాను. అధికారులను, పెద్దలను, గురువులను చూచినప్పుడు గౌరవభావము కలిగించుకొనుటకు పూనుకొన్నాను.

(2) నా తండ్రీ! ఎవరైనా నా తలంపులోనికి వచ్చినప్పుడును, కంటికి కనబడునప్పుడును, 'వారిని దీవించుము' అని మనస్సులో ఈ చిన్న ఏకపద ప్రార్థన చేయుటకు పూనుకొన్నాను.

(3) దేవా! కష్టస్థితిలో నున్నవారు జ్ఞాపకము వచ్చినప్పుడును, కనబడినప్పుడును, నా మనస్సున జాలిపడుటకు పూనుకొన్నాను.

(4) దేవా! ఎప్పుడైనా ఒకసారి భూగోళముయొక్క పటముచూచి ప్రతి దేశమును గురించియు, ప్రతి లంకను గురించియు ప్రార్థించుటకు పూనుకొన్నాను.

(5) ఓ దేవా! ఏక దైవారాధనచేయు మతస్థులను గురించియు, యూదా మతస్థులను గురించియు, బౌద్ధ మతస్థులను గురించియు, జైన మతస్థులను గురించియు, పారశీక మతస్థులను గురించియు, నాస్థిక మతస్థులను గురించియు అప్పుడప్పుడు ప్రార్ధించుటకు పూనుకొన్నాను.

(6) దేవా! జీవరాసులను గురించియు, వృక్షాదులను గురించియు, శాపము పొందిన భూమిని గురించియు, ఆకాశమందున్న వాటిని గురించియు అప్పుడప్పుడు ప్రార్ధించుటకు పూనుకొన్నాను.

(7) దేవా! మానవులకు హానిచేయు క్రిములను గురించియు, ఇతర జీవరాసులను గురించియు ప్రార్థించుటకు పూనుకొన్నాను.

(8) దేవా! నీవు కలుగజేసిన సమస్తమును దీవించుమని ప్రార్థించుటకు పూనుకొన్నాను.

(9) నేను మరచిపోయి ప్రార్థింపని అంశములను గురించి నీ సన్నిధిలో పెట్టుటకు పూనుకొన్నాను.

(10) దేవా! మానవుల ఉపయోగార్ధమై నరులు కల్పించిన వాటిని అనగా పాఠశాలలను, వైద్యశాలలను, చేతిపనుల శాలలను, అన్ని వృత్తులను, అన్ని ఉపయోగకరమైన వస్తువులను గురించియు ప్రార్థించుటకు పూనుకొన్నాను.

15) దేవా! కొన్ని మనవులు చేయుచున్నాను;

1. “క్రైస్తవ సంఘమా - ఘనకార్యములు చేయు - కాలము వచ్చెను" అను కీర్తనలోని సంగతులు త్వరగా నెరవేర్చుదువని నమ్ముచున్నాను.

2. “పరమ దేవుండే - నా పక్షమైయుండగాఅను కీర్తనలోని సంగతి నెరవేర్చుదువని నమ్ముచున్నాను.

3. “మనో విచారము కూడదు నీకుఅను కీర్తనలోని సంగతులు త్వరగా నెరవేర్చుదువని నమ్ముచున్నాను.

4. “యేసు నామస్మరణ చేయండిఅను కీర్తన ఇంకా ఎక్కువగా దీవించుదువని నమ్ముచున్నాను.