Skip to main content

ఆదివార ప్రమేయము - 2

ఆరాధన క్రమము: ఎవరి ఇష్ట ప్రకారము వారు ఆదివార ప్రోగ్రాము (కార్య క్రమమును) ఏర్పరచుకొన వచ్చును. అయితే వెయ్యేండ్ల పరిపాలనలో జరుగనైయున్న ఆరాధనను, ప్రతి ఆరాధనలోను జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను.

1) సంఘము కూడుకొనగానే కిన్నెరమీద (గిటారుమీద సంగీత వాయిద్యము) ఒక కీర్తన వాయించవలెను. ఇది సంఘమునకు ప్రారంభ ఉద్రేకము కలిగించును.

2) తర్వాత ఒక స్తుతి కీర్తన పాడవలెను లేదా పరిశుద్ధాత్మను పిలుచునట్టి కీర్తనయైనను పాడవలెను.

3) 'తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ఆరాధన ఆరంభించుదము' అని బోధకుడు చెప్పగా సంఘము 'ఆమేన్' అనవలెను.

4) సంఘము రెండు మూడు నిమిషములు త్రియేక దేవుని తలంచుకొని నిశ్శబ్దముగా నుండవలెను.

5) అప్పుడు బోధకుడు పాపపు టొప్పుదల చేయించవలెను (సంఘము మోకాళ్ళూని ఒప్పుదల చేయవలెను).

6) పాపములు క్షమింపబడినవను విశ్వాసము కలిగించుకొనుచు, సంఘము రెండు మూడు నిమిషములు ఊరకుండవలెను.

7) తర్వాత బోధకుడు, సంఘముచేత క్షమాపణార్ధమైన స్తుతి చేయింపవలెను.

8) తరువాత సంఘమంతటిచేత తీర్మానము చేయింపవలెను. 'మాకు తెలిసిన ఏ పొరపాటును చేయము; చేయకుండుటకు ప్రయత్నించెదమను' తీర్మానము చేయింపవలెను. తర్వాత తీర్మాన ప్రార్ధన చేయవలెను. తీర్మానము నెరవేర్చుకొనగల శక్తి దయచేయుమని' వేడుకొనవలెను.

9) తరువాత సమర్పణ చేయవలెను. శరీరమును, ఆత్మను, ఇంకను కలిగియున్న సమస్తమును, ముఖ్యముగా మన చిత్తమును దేవునిచిత్తమునకు సమర్పణ చేయవలెను. దేవునికి మనలను మనలమే అప్పగించి వేసికొనవలెను. ఆయనకు పూర్తిగా లోబడిపోవలెను. (ఇట్టి ప్రార్థనచేసి, సమర్పణ స్థిరపడుటకుగాను రెండు మూడు నిమిషములు నిశ్శబ్దముగా నుండవలెను). తరువాత 'సమర్పణ నెరవేర్చుకొనగల శక్తిని దయచేయుము' అను ప్రార్థన చేయవలెను. (స్తుతికీర్తన పాడవచ్చును)

10) తర్వాత విశ్వాసప్రమాణము చెప్పించవలెను. ఇది సమర్పణకు సమీపముగానున్న అంశము. విశ్వాస ప్రమాణమనగా 'నీవు నా తండ్రివి, నీవు నా పోషకుడవు, నీవు నా రక్షకుడవు, నీవు నా సమస్తమై యున్నావు' అను మాటలతో చేయబడవలెను.

11) బైబిలు పాఠమును, సంఘము నిలువబడి చదువవలెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురిని తలంచుకొని చదువవలెను (ఇక్కడ ఏ కీర్తననైనను పాడవచ్చును).

12) తరువాత ప్రసంగము చేయవలెను. ప్రసంగాంతమందు త్రియేక దేవుని స్తుతి పాడవలెను లేదా చెప్పవలెను.

13) తర్వాత కానుకలు అర్పించుట (కానుకలకు సంబంధించిన కీర్తన పాడవచ్చును). కానుకల విషయమైన ప్రార్ధన చేయవలెను.

14) ప్రకటనలు వినిపింపవలెను.

15) తరువాత నానా అంశముల మీద ప్రార్ధన, ప్రత్యేకాంశముల మీద ప్రార్థన చేయవలెను.

16) కొన్ని నిమిషములు ఊరుకొనవలెను (కనిపెట్టుట). ముగింపులో ప్రభువు ప్రార్థన, దీవెనతో ముగించవలెను.

1) షరా: సర్వాంశ ప్రార్ధనలో- 'అన్ని క్రైస్తవ శాఖలయొక్క ఐకమత్యత, బైబిలు సొసైటీ, ట్రాక్టు సొసైటీ, రోగులకొరకైన ప్రయత్నములను దీవించుమని, బీదలకొరకైన ప్రయత్నములను దీవించుమని, పాపుల కొరకైన ప్రార్ధనలు, సర్వ రాష్ట్రములకు సువార్త ప్రకటన కొరకు, యుద్ధములు రాకుండుటకు మొదలగు అంశములన్నియు ఉండవలెను.

2) షరా: గుడిలో మాట్లాడుట, గుడికి ఆలస్యముగా వచ్చుట, మధ్యన లేచిపోవుట, పాటలు అందరితో కలసి పాడకపోవుట, కునుకుపాట్లు పడుట, అరిగిపోయిన నాణెములు, చెల్లని నోట్లు చందాలో వేయుట, పిల్లలు అల్లరిచేయుట, వరధ్యానముగా నుండుట ఈ మొదలైనవన్నియు మానివేయవలెను (ఆరాధన గంటన్నర కన్నను ఎక్కువ ఉండుట మంచిదికాదు).

3) షరా: కొన్ని సంఘములలో బోధకులు వంతు ప్రకారము, దావీదు కీర్తనలు చదువుదురు. ఇది మంచి వాడుక.

4) షరా: ప్రతి ఆరాధనకు 'త్రియేక దేవుడు, దూతలు, పరిశుద్ధులు వస్తారు' అను సంగతి జ్ఞాపకముంచుకొనవలెను. బడికి వెళ్ళుట అనగా పిల్లలకు సంతోషము., అట్లే ఆటలు అనగా పిల్లలకు ఎంతో సంతోషము. ఆలాగే ఆరాధన అనగా విశ్వాసులకు మహా ఆనందము కలుగవలెను.

5) షరా: కొందరు ప్రసంగము ముగియగానే వెళ్ళిపోవుదురు. వారి దృష్టిలో ప్రసంగమే ఆరాధన. అయితే ప్రసంగము కంటే, ఆరాధనే ముఖ్యము.

6) షరా: పెండ్లికుమార్తె చేయు ఆరాధన మిక్కిలి ప్రశస్తమైనదై యుండవలెను. వజ్రమువలె ఉండవలెను.

7) షరా: ఆరాధనలో, మనలను మనము ప్రభువునకు సమర్పించుకొనవలెను. అప్పుడు ప్రభువు తాను మనకివ్వవలసినవి సమర్పిస్తారు.

8) షరా: ఆరాధనలో ముఖ్యమైనది స్తుతి. మరియు మన కీర్తనలు, ప్రార్ధనలు, స్తుతులు, కానుకలు ప్రభువు అంగీకరించినట్లు మన మనస్సునకు తట్టవలెను.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...