ప్రత్యక్షతలు
1. దర్శన ప్రత్యక్షత :
దీనిలో
విశ్వాసులకు అంతయు, అన్నియు కనబడవచ్చును. భూలోకము, పరలోకము, పాతాళలోకము, వాయుమండల లోకము
ఈ మొదలైన స్థలములు వాటిలోనున్న సమస్తమును సమయానుకూలముగ కనబడవచ్చును. దీనినే దర్శనమందురు.
దేవుడు, దూతలు, మహిమయు, పరలోక వాస్తవ్యులు భూలోక గొప్ప బలము కలుగును. వీటిని చూచు వరము
కలిగిన విశ్వాసికి విశ్వాసులు కనబడినప్పుడు విశ్వాసికి దయ్యములు, దుర్జనులు, క్రూరమృగములు,
విషపురుగులు, అపవిత్ర స్థానములు, భయంకర స్థలములు, పాతాళ లోకము అపాయకరమైనవి, ఈ మొదలగునవి
కనబడినప్పుడు కూడ సంతోషించవలెను. ఎందుకనగా అవి ఉన్నవి గనుక కనబడకపోవునా ? (ఆది
46:2; నిర్గమ 3 అ; సంఖ్యా 24:4; 1 సమూ 3:1; యోబు 7:14; కీర్తన 89:19; యెషయా 1:1; యిర్మీయా
23:16,17; విలాప 2:9; యెహె 1:1; హోషేయ 12:10; యోవేలు 2:28; మత్తయి 17:9; కార్య
10:17; 12:9; 26:19; 2 కొరింథి 12:1 (ప్రకటన గ్రంథము).
2.
వాక్కు లేక - స్వర ప్రత్యక్షత :
దీనిలో
పైనుదహరించిన వారిలో ఎవరో ఒకరు మాట్లాడుమాటలు వినబడును. ముఖ్యముగా ప్రభువు యొక్కయు పరిశుద్ధులు యొక్కయు
మాటలు వినబడును. నా గొర్రెలు నా శబ్దము వినును - అని ప్రభువు చెప్పెనుగదా ! (నిర్గమ
23:21; Deuteronomy 4:33; 1 రాజులు 9:13; యోహాను
10:4).
3.
వ్రాత ప్రత్యక్షత :
దీనిలో
సందేశము అనగా వర్తమానము. గాలిలో గాని, గోడమీద గాని, ఏదైన బోర్డు మీద గాని అక్షరములు
కనబడును లేదా అచ్చువేయబడిన అక్షరములు కనబడును. దావీదునకు దేవుడు దేవాలయము యొక్క నిర్మాణపద్ధతి
వ్రాత మూలముగా చూపెను (2 దినవృ 28:19). ఒకానొక్కప్పుడు చేతివ్రాత కూడ కనబడును. మరియు
పరలోకము నుండి అట్టబోర్డు వచ్చును. దానిమీద ఒకరు వ్రాత వ్రాసి చూపిंతురు. అది చదివి నోట్బులో వ్రాసికొనవలయును. త్వరగా
వ్రాసిన చేతులునొచ్చి పైకి వెళ్ళిపోయినట్లు పోవును (దానియేలు 5:24).
4.
స్వప్న ప్రత్యక్షత :
విశ్వాసికి
దేవుడు స్వప్నములో కనబడి సంగతులు తెలియపరచును. యోసేపునకు ఈ ప్రత్యక్షత గలదు. పగలు చూచినది,
విన్నది రాత్రి కలలో కనబడిన అది ప్రత్యక్షత కాదు. దైవ ప్రత్యక్షత స్వప్నములలో కూడ కలుగును.
(ఆది 20:3; 31:11; 37:5; 1 రాజులు 3:5; యిర్మీయా 23:28; దానియేలు 2:3; 4:19; 7:1, మత్తయి
1:20; 2:12, 13, 22)
5.
ఊహ ప్రత్యక్షత :
విశ్వాసి
ఒక అంశముపై ప్రార్థించి జవాబు కొరకు కనిపెట్టునప్పుడు దేవుడు ఊహ పుట్టించును. అది కూడ
దైవ ప్రత్యక్షతయే. అట్టి ఊహ నెరవేరుట విశ్వాసియొక్క అనుభవములో నుండును. అని అ. కార్య
15:28లో గలదు.
6.
జ్ఞాన ప్రత్యక్షత :
ఇది
దేవుడనుగ్రహించిన జ్ఞానమునుబట్టి గ్రహించుకొను శక్తి. సొలొమోను జ్ఞానమును బట్టి గదా
వేశ్యలకు తీర్పు విధించెను. జ్ఞానమునుబట్టియే కదా నూతన యంత్రములు, స్టీమర్లు, విమానములు
మొదలైనవి కనిపెట్టినారు. దేవుని సార్వత్రిక ప్రేమనుబట్టి అవిశ్వాసులకు కూడ ఇట్టి జ్ఞాన
మిచ్చుచుండెను. ఇది ఆత్మీయ జ్ఞానము కాదు. విశ్వాసులకు ఆత్మీయ జ్ఞానము ఇవ్వబడును. జ్ఞానము
కూడ ఒక వరమని బైబిలులో కలదు (యాకోబు 1:5).
7.
వాక్య ప్రత్యక్షత :
బైబిలులోనున్న
వాక్యము ద్వారా దైవచిత్తము విశ్వాసికి బైలుపడును. స్వప్నములు ఒకానొక్కప్పుడు సరికాకపోవచ్చును.
దర్శనములు కూడ సరికాక పోవచ్చును. ఊహలు సరికాక పోవచ్చును. గాని వాక్య ప్రత్యక్షత ఎప్పుడును
సరిగానే యుండును. ఎందుకనగా అది వ్రాయబడి యున్నది. వాక్యము మార్చుటకు వీలులేదు. “అడుగుడి
మీ కియ్యబడును” అని వాక్యము గలదు. దానిని ఎవ్వరు మార్చలేదు. దేవదూతలు ఒకవేళ కాదన్నను
మనమాటే చెల్లును. ఎందుకనగా వ్రాత మార్చుటకు వీలులేదు. ప్రార్థనచేసిన తర్వాత మనము జ్ఞానము
ఉపయోగించి బైబిలుతీసి జాగ్రత్తగా వెదకినయెడల మన ప్రార్థనకు తగిన వాక్యము దొరుకును.
తెలివి తక్కువగాను, అజ్ఞానముతోను వెదకిన యెడల కావలసిన వాక్యము దొరకకపోవచ్చును. నీవు
ప్రార్థన చేసినావు, నెరవేరలేదు అని ఇతరులుగాని, నీ స్వంత మనసుగాని, పిశాచిగాని చెప్పిన
యెడల ఎంత మధురముగానున్నను నమ్మవద్దు వ్రాత వాక్యమునే నమ్ముము. అప్పుడు క్షేమము కలుగును.
షరా
:
(1)
కనిపెట్టు స్థలము అనగా దైవసన్నిధి. ఇక్కడ ప్రభువు మాటలాడును. ఇతర కూటములలో మనము మాట్లాడుదుము.
ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథమువరకు ప్రభువు మాట్లాడిన విషయములు ధ్యానించిన మేలు కలుగును.
(2)
కొందరికి పై ప్రత్యక్షతలలో ఏదో ఒకటి ఉండును. లేక రెండు మూడు ప్రత్యక్షత లుండును. కొందరికి
అన్ని ప్రత్యక్షతలు ఉండును. వీటిని సరియైన రీతిగ వాడుటనుబట్టి వరము ఉపయోగములోనికి వచ్చును.
(3)
కనిపెట్టు సమయములో ఈ వరము వాడుకలో నుండును. కొందరికి ఎప్పుడుబడితే అప్పుడే ఈ ప్రత్యక్షతలు
ఉండును, హృదయ స్థితినిబట్టి ఆయా వరములు వాడుకలో నుండును.

