Skip to main content

స్వార్పణ

పైనున్న గాలి, ఎండ, వర్షము; క్రింద ఉన్న భూమి, ధనము, పిల్లలు; ఇంట్లో ఉన్నవి; ఒంట్లో ఉన్న ప్రాణము; అన్నియు దేవునికి అర్పించవచ్చును గాని ఆత్మ ఒక్కటే, మనిషి దేవునికి అర్పించలేడు. ఆత్మ అనగా మనిషి తనయొక్క ఇష్టమును దేవునికి అర్పించలేడు, ఆలాగు అర్పించగలిగిన యెడల అది స్వార్పణ.

స్వార్పణ పాఠము:- భూమి, జనము, ధనము, ఎండ, గాలి, వాన, ఇంట్లోని సామాను, శరీరము, ప్రాణము ఇంకా ఏమేమి ఉన్నాయో, అవి అన్నియు దేవునికి అర్పించుటకు నరుడు ఒప్పుకొనవచ్చును. అయితే ఇది స్వార్పణ కాదు. ఆత్మను అనగా హృదయమును, అనగా స్వంత ఇష్టమును అర్పించుట స్వార్పణ అనబడును. శరీరము కాల్చబడుటకు ఇచ్చినను, ప్రేమలేనివాడవైతే ప్రయోజనము లేదని 1కొరింథి 13వ అధ్యాయములో ఉన్న సంగతిని బట్టి చూడగా - అర్పణము, స్వార్పణము కలవు అని బోధపడుచున్నది. అనగా అర్పణ వేరు, స్వార్పణ వేరని తెలియుచున్నది. 'వీరు ఎక్కువ ధనము ఇచ్చినవారు', అని ప్రభువు ధనవంతుల కానుకలను మెచ్చుకొనలేదు. ఆయన కేవలము స్వార్పణనే లక్ష్యపెట్టెను. దీనికి సంబంధించి సంఘ చరిత్రలో అనేక కథలు ఉన్నవి.

మొదటి కథ:– ప్రారంభ హతసాక్షులను చూచి, కొందరు హత సాక్ష్యమునకు ఒప్పుకొనిరి. పైన ఉదహరించిన అర్పణములు, వారు ఇష్టముతోనే వేసియుందురు. అయితే స్వార్పణ అనునది వేరొకటి కలదు. అది ఏదై యుండును? అర్పణలో మనుష్యుడు తన లాభమును కోరుట కలదు. అందుచేత వానికి రాణింపులేదు. అర్పణములో లాభము ఏదనగా కీర్తికోరుట. ఉపచారము (మేలు) కల్గుననే ఒక తప్పు అభిప్రాయము కల్గియుండుటవల్ల కూడ అర్పణములిచ్చుట జరుగును. గనుక ఇదికూడా స్వార్పణ కాదు. ఒకరు తన ఆత్మీయ మేలు నిమిత్తము నిద్రమాని రాత్రింబగళ్ళు, మోకాళ్ళమీద ప్రార్ధనలో గడుపవచ్చును. అయితే ఇదియు స్వార్పణ కాదు. మరియొకరు ఆదికాండము మొదలు ప్రకటన వరకు కంఠత చేసి, వాక్యమును బాగా అర్థము చేసికొనే వాక్యభాగ్యము కల్గియుందురు. ఇందువల్ల జ్ఞానము కల్గుననే తృప్తి వారి ఉద్దేశమై యున్నది. ఇదియు స్వార్పణలో చేరకపోయి యుండవచ్చును. మరియొకరు సుఖ సంతోషమును చూడక, జీతనాతములు లెక్కచేయక, మనుష్యుల నిందలు నిర్లక్షపెట్టి, శక్తి వంచనలేక సువార్త పని చేయుదురు, గొప్ప బోధకులమని పేరు పొందుదురు. సువార్త నిమిత్తము అంతయు విసర్జింతురు. దీనినికూడా స్వార్పణలో చేర్చకపోవచ్చును.

1వ కథ: సర్ ఐజక్ న్యూటన్ మహాగొప్ప పండితుడు. అతడు చెప్పినదేమనగా 'లోకమున భక్తులని పేరు పొందిన వారిలో కొందరు ఎందుచేత నరకములో యున్నారు?' (యేసు నామమున అద్భుతములు చేసిన వారిని చూచి ప్రభువు- నేను వారిని ఎరుగనన్నాడు). వారుకూడ ఈ తరగతిలో చేరినవారే! బట్లరు అనే దైవజనుడు క్రీస్తు దైవత్వమును గూర్చి అంగీకరించి, అనేక గ్రంథములు రచించి, చివరకు అవిశ్వాసి యాయెను.

2వ కథ: భూలోకములో ప్రసిద్ధి చెందిన దురంతకులు (పాపాత్ములు) మోక్షములో యున్నారేమి? (ఉదా: సిలువ మీద దొంగ, 7 దయ్యములు పట్టిన మగ్దలేనే మరియ).

3వ కథ: ఇది ఏమిటి? దేవుడు నన్ను మోక్షములోనికి తీసికొని వచ్చినాడు! అని కొందరు ఆశ్చర్యపడుదురు. ఈ మూడు ఆశ్చర్యమైన సంగతులు జ్ఞాపకముంచు కొనండి. స్వార్పణ చేయుట ద్వారా మహా ఆశ్చర్యమైన, మహా ఉన్నతమైన స్థితిని పొందుదురు. ఇది సంపాదించుకొనుట సులువే గాని కాపాడుకొనుట కష్టము, గనుక జాగ్రత్త పడుము.

స్వార్పణ: 1. స్వార్పణను గ్రహించుటకు, అబ్రాహాము ఇస్సాకును అర్పించిన కథ చదవండి. యెఫ్తా తన కుమార్తెను దేవునికి అర్పించిన కథ చదవండి. స్వార్పణ అనగా బైబిలులో ఏమి యున్నదో అట్లు చేయుట. చదివిన తరువాత, నేర్చుకొన్న తరువాత, తీరా చేయవలసి వచ్చినప్పుడు ప్రశ్నించకూడదు. ఇట్లు చేయుటే స్వార్పణ. 'గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నీ చిత్తమును నెరవేర్చుటకు మేము వచ్చియున్నాము' అని చెప్పవలెను.

2వది: దేవుడు బయలుపర్చినది నెరవేర్చుట: స్వార్పణ చేస్తేనే గాని దేవుడు సంగతులు బైలుపర్చడు.

3. మన స్వంత చిత్తమును వదలుకొని, దేవుని చిత్తమును చేయుట: దేవుని చిత్తము నెరవేర్చుట, ఎంత కష్టమో స్వంత చిత్తమును వదలుకొనుట కూడ అంత కష్టము.

4. ఇముడ్చుకొనుట: అనగా సంగతులు తెలిసినప్పుడు, యోగ్యులైనవారు వాటిని ఇముడ్చుకొందురు, అనగా వెల్లడి చేయరు. (అయితే కూటస్థులకు చెప్పవచ్చును).

5. శ్రమలు వచ్చినపుడు సహించలేరు. అలాగే మహిమ తెల్సినపుడు ఓర్చుకొనలేరు.

6. అంగీకరించుట: మీరు విన్నారు, గ్రహించినారు, ఆనందించినారు, నమ్మినారు. అయితే అంగీకరించినారా? స్వార్పణ చేయువారు అంగీకరింతురు. చిన్న పిల్లలు దేవుని రాజ్యమును అంగీకరింతురని ప్రభువు చెప్పిన మాట వల్ల తెలియుచున్నది. అంగీకరించుట అనగా మహా బాగాయున్నదని ఒప్పుకొనుట. ఇంకొకటి- అంగీకరించుట అనగా పుచ్చుకొనుట, అందుకొనుట, హక్కుగా చేసికొనుట, స్వతంత్రించుకొనుట, దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టక ఆయన చేతిలోనుండి తీసికొనుట. మనము అడిగినది మరల అడుగకుండుట వల్ల అంగీకరించితిమని ఋజువు అగుచున్నది.

7. చనిపోవుటయే స్వార్పణ: మీ స్వభావములో పుట్టే చెడ్డ ఆశలన్నిటిని చంపి వేయవలయును. పిశాచి పుట్టించే తలంపులకు సహితము లోబడకూడదు. 'దొంగిలిన వాడు ఇకమీదట అక్కర గలవానికి పంచిపెట్టవలయును' అను వాక్యము జ్ఞాపకము తెచ్చుకొనండి. మన స్వభావము పూర్తిగా మారిపోవలెను. ప్రశ్నలు వేయవచ్చును గాని అవిశ్వాసములో నుండి అవి రాకూడదు. విశ్వాసములో నుండియే రావలెను. నాయందు జీవించుట, నేనుకాదు; క్రీస్తే నాయందు జీవించుట అయియున్నాడు.

స్వార్పణ ప్రార్థన: 1. తండ్రివైయున్న తండ్రీ! కుమారుడవై యున్న తండ్రీ! పరిశుద్ధాత్మవై యున్న తండ్రీ! త్రియేకుడవైయున్న తండ్రీ! నేను నిన్ను నా ప్రియమైన తండ్రిగా భావించుచున్నాను. నన్నునూ, నీ ప్రియమైన బిడ్డగా భావించుకొందును, ఆలాగుననే ప్రవర్తించెదను. ఆమెన్.

2. నేను అన్న వస్త్రాదులను గాని, ధన ధాన్యాదులను గాని, భూమిని గాని, విద్యను గాని, తుదకు మోక్షమును గాని, కోరుకొనుట లేదుగాని నిన్నే కోరుకొనుచున్నాను. నీవే నాకు సమస్తమై యున్నావు. నేను నీ మీదనే ఆనుకొందును, నిన్నే నమ్ముదును, నిన్నే చూతును. నీవు తప్ప నాకేమియు గొప్ప లేదు. ఆమెన్.

3. 'దేవా! నేను ఏమి చేయకూడదో, ఏమి చేయవలెనో, 'బైబిలు' అనే గ్రంథములో యున్నది. అది చదివి, దాని ప్రకారముగా హాని వచ్చినా, చేస్తాను. పది యాజ్ఞలను బట్టియు, బైబిలులోని ఇతర సంగతులను బట్టియు, నా మనస్సాక్షిని బట్టియు, నీ యాత్మ వెలిగింపును బట్టియు, నన్ను నేను పరీక్షించుకొని నా లోపములు తెలుసుకొని, అన్నియు నీ దగ్గర ఒప్పుకొని దిద్దుబాటు చేసికొందును. ఇట్లు ఊడ్చిన (శుద్ధిచేసికొనిన) పిమ్మట ప్రభువును రానివ్వవలెను.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...