Skip to main content

బైబిలు అద్దము

బైబిలు అనగా పుస్తకమని అర్థము. అనగా లోకములోని గ్రంథములన్నిటిలో గొప్ప గ్రంథమని అర్థమిచ్చు బిబ్లాస్ అను గ్రీకు పదమునుండి 'బైబిలు' అను పేరు వచ్చినది. ఇది దైవాత్మ ప్రేరణవలన వ్రాయబడిన గ్రంధము గనుక అన్ని గ్రంధములకంటె ఇది గొప్ప గ్రంధమని, 'బైబిలు' అనుపేరులోనే తెలియుచున్నది. ఆదియందు దేవుడు సృష్టిని, మానవులను, లోకములోని సమస్తమును ఎట్లు సృజించెనో, ఆ పిమ్మట మానవునిలోనికి పాపము ఎట్లు ప్రవేశించెనో, పాపమునుండి నరులను రక్షించుటకు, దేవుడు ఎట్లు వాగ్దానము వినిపించెనో, దానిని నెరవేర్చుటకు దేవుడు తన పనినెట్లు చేయుచు వచ్చెనో, ఇది పాపము, ఇది పవిత్రము అని ఎట్లు బోధించెనో, పాపము ఎట్లు వదిలించు కొనవలెనో, దేవుడిచ్చునవి ఎట్లు పుచ్చుకొనవలెనో, బైబిలు చెప్పుచున్నది. మన పాపములు ఏ రీతిని పరిహరింపబడునో బైబిలులో నున్నది.

పాపములను జయించు శక్తి ఏలాగు పొందగలమో బైబిలులో వివరించబడినది. దేవునిని ఏలాగు నమ్మవలెనో, నీతిగా ఎట్లు నడచుకొనవచ్చునో, పాపకారకుడైన సాతానును ఏలాగు ఓడించగలమో బైబిలు తెలియ జేయుచున్నది. గనుక ఈ బైబిలు గ్రంధమును అద్దము అనవచ్చును. అద్దము ఏరీతిని మానవుని బహిరంగ స్థితిని చూపించునో, ఆలాగుననే బైబిలు అనే అద్దముకూడ మానవుని అంతరంగ స్థితిని చక్కగా చూపించుచుండును. ఈ బైబిలు అద్దమును చూచి మానవుడు తన బ్రతుకును సరిచేసికొన్నచో మోక్షరాజ్యములో ప్రవేశించి, మహిమ జీవనమునకు వారసుడగును. ఈలాగున మానవుడు తన్నుతాను దిద్దుకొనుటకు, ఈ బైబిలు అద్దము చూపించుచున్న కొన్ని సంగతులు:

1. దేవునికి విరోధమైన తప్పిదములు: దేవుని విషయములో తప్పు అభిప్రాయములు కలిగియుండుట, దేవునిమీద విసుగుకొనుట మొదలైనవి.

2. నీకు విరోధమైన తప్పిదములు: అనగా శరీరమునకు, ఆత్మ జీవనమునకు, శరీర జీవమునకు హాని తెచ్చు తప్పిదములు.

3. దేవదూతలకు విరోధమైన తప్పిదములు: అనగా దేవదూతల సహాయము నాకేమి కనబడుట లేదనుకొనుట.

4. నరులకు విరోధములైన తప్పిదములు: శత్రువులను ప్రేమింపకుండుట, వారికొరకు ప్రార్థింపకుండుట.

5. జీవరాసులకు విరోధములైన తప్పిదములు: జీవరాసులను నిర్దయగా చూచుట,

6. వస్తువులకు విరోధములైన తప్పిదములు: అనగా సామానులను, సరుకులను దుర్వినియోగపరచునట్టి తప్పిదములు.

7. తలంపు, చూపు, వినికి, మాట, ప్రయత్నము, క్రియ, స్వప్నములలోని కళంకము.

8. ధర్మగుణము లేకుండుట: అనగా బీదలను కనిపెట్టకుండుట, వారు సహాయము కోరునప్పుడు ఇయ్యకపోవుట, ధర్మకార్యములకు చందాలియ్యక పోవుట.

9. సోమరి తనము: అనగా కష్టపడి పనిచేయని గుణము, పనిచేయవలసి వచ్చినను బద్దకించుట, ఒకరిపాటు మీద బ్రతుకవలెనని చూచుట.

10. జబ్బుచేసినపుడు బాగుచేసికొనక నిర్లక్ష్యముగా నుండుట, కోపగించిగాని, నిరాశవలన గాని తిండి మానుట, చావు త్వరగా వస్తే బాగుండును అని తలంచుట, శరీరము శుద్ధిగా నుంచుకొనకుండుట, అపవిత్ర జీవనము వలన అకాల మరణమొందుట.

11. భార్య భర్తలలో సమాధానము లేకుండుట: మనస్పర్ధలకు సందున్నను సఖ్యత లేకుండుట, క్షమించు నైజము లేకుండుట, యౌవ్వనకాల అపవిత్రత కలిగియుండుట.

12. అబద్ధమాడుట: అనగా అబద్ధమును నిజమును కలిపి చెప్పుట. పంచాయితీలలో, కోర్టులలో అబద్ద సాక్ష్యము పలుకుట.

13. ద్వందార్ధములు: అనగా మోసము చేయవలెనని, అబద్ధమాడవలెనని, రెండు అర్థములు ఇచ్చే మాటలు మాట్లాడుట.

14. అప్పులు తీర్చెదనని జరుపుట, తీర్చకుండుట

15. అసూయ: అనగా నీకంటె ఎక్కువ కలిమిగల వారిని, గొప్ప ఉద్యోగములు గలవారిని, నీకులేని వరములు గలవారిని చూచి మనస్సులో కష్టము కలిగియుండుట,

16. లేనిపోని ఊహలు, అనవసరమైన తలంపులు,

17. దురాశ: అనగా ఒకరి ఆస్థిలో దేనినైనను ఆశించుట.

18. సందేహము: అనగా అవిశ్వాసము, వెనుకాడుట, అది నిజమా అనుకొనుట, అనగా మోక్షము, నరకములు ఉండుట నిజమా అనుకొని, సందేహము కలిగియుండుట.

19. అనిశ్చయము: బైబిలులోని సంగతులు అందరు అన్ని విధములుగా బోధించుచున్నందున, ఎవరిబోధ నిజమో నిశ్చయము తెలియని స్థితి కలిగియుండుట.

20. అతిశయము: గర్వము, బడాయి, గొప్పతనము కోరుకొనుట, నరుల మెప్పుకోరుట.

21. భయము: అనగా దిగులు, బెదురు, పాము, పులి, హానిచేసే మనిషి, విరోధముగా మాట్లాడే మనిషి తారసిల్లినపుడెల్ల జంకుట, భయపడుట; చెడుకలలు తప్పుడు దర్శనములు, నింద మాటలు వచ్చినప్పుడు భయపడుట; దుశ్శకునములు, సోదె చెప్పువారిమాటలు, మంత్రగాండ్ర మాటలు శపించు వారి మాటలు మొదలైనవి విని భయము కలిగియుండుట.

22. చింత: అది నెరవేరలేదు. ఇది నెరవేరలేదు అనే చింత.

23. అధైర్యము: అనగా నిరాశ.

24. పేద అరుపులు: అదిలేదు, ఇదిలేదు అని; దానికి కొరత, దీనికి కొరత అని అనుకొనుట; తృప్తి లేకపోవుట.

25. నిష్కారణ కోపము: చిరచిరలాడుట, కారణము లేకుండా కోపపడుట.

26. మందస్థితి కలిగియుండుట: మతబోధ విన్నప్పుడు పాపస్థితిని తెలిసికొనియు నిర్లక్ష్యముగా నుండుట; పాపమువలన కష్టములు, మరణము, నరకము అని విన్నప్పటికిని లెక్కలేకుండా ఉండుట; ఎన్ని బోధలు విన్న మారకుండుట; మోక్షములో మహిమయున్నదని వినినను ఆశలేకుండుట.

27. కృపను లోకువగట్టుట: అనగా ఎన్ని తప్పులు చేసినను, దేవుడు క్షమించును గదా అని అనుకొని విచ్చలవిడిగా తిరుగుట.

28. నెరవేర్చవలసిన విధులను నెరవేర్చకుండుట.

29. పొందిన మేలును గుర్తెరిగియు, ఉపకారులను మరచుట; దేవుని యెడల కృతజ్ఞత లేకుండుట.

30 మర్యాద చేయకపోవుట: మనకంటె పెద్దవారై యున్నవారిని గౌరవముగా చూడకుండుట, సంఘాధికారులను మన్నన చేయకుండుట (చేయలేకపోవుట).

ఈలాగున, పై బలహీనతలన్నిటినీ ఈ బైబిలు అద్దములో చూచుకొని, సరిచేసికొని, మహిమ జీవనములో స్థిరపడు ధన్యత పెండ్లికుమారుడైన క్రీస్తు ప్రభువు మీకు దయచేయునుగాక! ఆమేన్.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...