Skip to main content

సమర్పణ ప్రార్థన ప్రసంగము

సమర్పణ అనగా 'బలి' లేక కలిగియున్న యావత్తు ప్రభువు స్వాధీనము చేయుట అని అర్ధము. నాకు కలిగియున్న యావత్తు నా ఇష్టమును బట్టి వాడుకొనను, నీ ఇష్టమునుబట్టియే వాడుకొందును. ఇవి సుఖముగా నున్నప్పుడు చేయు సమర్పణలు. అయితే కష్టకాలములో కూడ ఇట్టి సమర్పణా స్థితి కలిగి యుండవలెను. ఈ ప్రకారము చేయునప్పుడు నాకు ఆపదలు, ఆటంకములు వచ్చినను నీ చిత్త ప్రకారము చేయుదును.

1) ఆపదను బట్టి బాటసారి, మంచి సమరయుడు చేసినదాని నంతటికి సమ్మతించెను. గాయములు కట్టనిచ్చెను, వాహనముమీద ఎక్కించినప్పుడు ఊరుకొనెను, పూటకూళ్ళవాని కప్పగించినప్పుడును ఊరుకొనెను, అంతయు చేయనిచ్చెను. ఆలాగే మనమును ఆయన కప్పగించుకొనిన యెడల, ఆయన ఎంత ఉపకారమైనను చేయగలడు.

2) 'వారు నీమాట వినరు, అయినప్పటికిని నీవు వెళ్ళి చెప్పవలెను' అని దేవుడు యెహెజ్కేలుతో పలికెను (యెహెజ్కేలు 2:4) యెహెజ్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినాడు గనుక ఎదురు చెప్పలేదు. వెళ్ళి వారికి బోధించినాడు. అలాగు దేవుడు మిమ్మును సువార్త అక్కరలేని వారియొద్దకు పంపిన యెడల మీరు వెళ్ళుదురా?

3) నీ సహోదరుని మీద నీకు ఏదైన కష్టముంటే ముందు సమాధానపడి, అప్పుడు బలిపీఠమునొద్దకు రమ్ము అని ప్రభువు ఉపన్యాసములో సెలవిచ్చెను (మత్తయి 5:24). ఇది కష్టమైన పని. చందావేయుట సుళువైన పని గాని సమాధానపడుట కష్టమైనపని. దేవుని వాక్యమిచ్చే సలహాకు సమర్పణయైనవారు వాక్యములోనున్నట్టు చేయుదురు. మీరు అలాగే చేయగలరా?

4) పేతురు యోహానులు గార్ధభము విప్పి తీసికొనివచ్చి, ప్రభువు చెప్పినట్లు చేసిరి. ఆలాగే ప్రభువు మీతో 'ఫలానిచోటికి వెళ్ళి, ఫలాని పనిచేసి రండి' అని చెప్పిన యెడల సందేహించకుండ చేయువారే, ఆయనకు సమర్పణ అయినవారు. సమర్పణ అయినవారు ప్రభువుయొక్క కోరికను తప్పక నెరవేర్చుదురు.

5) ఐదువేలమందికి ఆహారము పెట్టకముందు, ప్రభువు శిష్యులతో- ప్రజలను బారులుగా కూర్చుండబెట్టవలసినదని చెప్పెను. ఆ ప్రకారము వారు చేసిరి. ఇందరకు సరిపోయే రొట్టెలు లేవుకదా! వచ్చిన తరువాత కూర్చుండ బెట్టవచ్చునని వారు ప్రభువునకు ఎదురు చెప్పలేదు. అలాగే సమర్పణ అయినవారు ఆటంకమును తలంచక ప్రభువు చెప్పినట్లు చేయుదురు.

6) ఒక స్త్రీ, తనకున్నది యావత్తు చందావేసెను. యూదుల నిబంధన ప్రకారము పదియవ భాగము వేయవలెను. నీకున్నదంతయు వేయుము అని ప్రభువు చెప్పక పోయినను ఆమె వేసినది. ప్రభువు చెప్పకపోయినను మనస్సాక్షికి తోచిన మంచి కార్యములు చేయువారే, సమర్పణయైనవారు. చెప్పినదే చేయలేక పోవుచున్నాము, చెప్పనిది మాత్రము చేయగలమా? అని పలుకువారు సమర్పణయైన వారుకారు.

7. నీటిమీద నడువవలసినదని ప్రభువు పేతురుతో చెప్పెను. మునిగిపోయినను భయము లేకుండ, ప్రభువు మాటకు సమర్పణయై కొంతదూరమైనను నడువగలిగెను. అసాధ్యమైన పని ప్రభువు చెప్పినప్పుడు పేతురు చేసెను. ఆలాగే అసాధ్యమైన పనులు ప్రభువు చెప్పినప్పుడు చేయువారే సమర్పణ అయినవారు.

8) ప్రభువు ఒకనిని చూచి నన్ను వెంబడించుమనెను. అతని దృష్టి తన తండ్రిని సమాధి చేయవలెనని ఉన్నది. మన ఇష్టము ఒక రీతిగా నున్నప్పుడు, ప్రభువు వద్దని చెప్పిన యెడల మానివేయ గలరా? అట్లు ప్రభువు వద్దని చెప్పినను, మానువారే సమర్పణ అయినవారు.

9) ప్రభువు డెబ్బదిమందిని ఏర్పరచి సువార్తకు పంపెను. ఇది సువార్తలలో, మనబోధ నిమిత్తము వ్రాయబడెను. ప్రభువు మనలను వేరుగాపిలిచి 'సువార్తకు వెళ్ళండని' చెప్పనక్కరలేదు. ఒక్కమారు చెప్పినా, అందరకు చెప్పివేసినట్టే. దానికి లోబడినవారే సమర్పణయైనవారు.

10) యెఫ్తా అను న్యాయాధిపతి జయముపొంది ఇంటికి వచ్చినప్పుడు, తన కుమార్తె ఎదురుగా వచ్చెను. ఆమెను దేవునికి సమర్పించి వేయవలసి వచ్చినను, అతడు వెనుకాడక సమర్పించెను. (న్యాయాధిపతులు 11వ అధ్యాయము) ఆలాగే మీ బిడ్డలలో ఎవరినైన ప్రభువునకు సమర్పించుమని చెప్పిన యెడల, ఆలాగు చేయగలరా? అట్టివారే సమర్పణ అయినవారు (యెఫ్తా కుమార్తె కూడ దానికి సమ్మతించెను)

11) అబ్రాహాము దైవబలము గలిగినవాడై, తన ఏక పుత్రుని తన చేతులతో బలివేయ నిశ్చయించుకొనెను. ఇది తల్లిదండ్రులైనవారు గ్రహింపలేని గొప్ప సమర్పణ. అట్లు మానవుల గ్రహింపునకు అర్థముగాని కార్యములు, ప్రభువు కొరకు చేయువారే, సమర్పణా పరులు. (ఇస్సాకుకూడ అందుకు సమ్మతించుట ఆశ్చర్యమే).

12) 'నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకాహారము' అని యేసు ప్రభువు చెప్పెను. దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు మనకు అన్నము తిన్నట్టుగానే ఉండునా? అట్లుండిన యెడల మీరు సమర్పణాపరులే.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...