త్రిత్వము అను దైవత్వము
"నేనే మార్గమును, సత్యమును, జీవమునై
యున్నాను."
1) జీవము: (1) ఇక్కడ త్రిత్వములో ఒకరై యున్న తండ్రియైన తండ్రిని తలంచుకొనవలెను.
ఆయన సృష్టిని కలుగజేసినప్పుడు, మొక్కలలోను, జీవరాశులలోను, తుదకు మనుష్యులలోను జీవమును
ధారపోసెను. ఆ జీవము నేటివరకు లోకములోగలదు. మానవులలో గొప్ప దుస్థితి గలదు. అనగా మానవుడు
పాపము చేసినప్పుడు మరణమునకు సమీపించుచుండును. పాపము చేసినప్పుడు తెలియని రీతిగా మనిషిలోనున్న
జీవము ఖర్చు అయిపోవుచుండును. కాబట్టి తండ్రి యెప్పటి కప్పుడే జీవము ధారపోయుచుండును. ఎండవేడిమికి
మొక్క లోని చెమ్మ తగ్గిపోవుచుండగా తోటమాలి నీళ్ళు పోయుచునేయుండును. అలాగే తండ్రి చేయుచుండెను.
ఈ జీవధార రెండు జీవితములకుపయోగము. మనజన్మము మొదలుకొని మరణ పర్యంతముగల జీవితమొకటి, ఈ
జీవితములో దుర్జనులకు సజ్జనులకుకూడ తండ్రి జీవము పోయుచుండును. అయితే విశ్వాసులకు మరణము
తర్వాత నిత్య జీవము కొనసాగింపబడును. ఈ రెండు విధములైన జీవితముల కనుదినము తండ్రి జీవము
ప్రసాదించుచునేయుండును. ఒకటి జ్ఞాపకముంచు కొనవలెను. మారుమనస్సు లేనివారికికూడ మరణము
తర్వాత అంధకారలోకమున జీవము ఉండును గాని అది మారుమనస్సుకొరకు గడువు జీవమై యుండును. చూచినారా!
తండ్రి ప్రేమ తండ్రి ప్రేమయే. ఏదోవిధముగా, వృధాఅని తెలిసినను జీవము ధారపోయుచునే ఉండును.
ఉదా: కోడిపిల్లకు దెబ్బతగిలిన
పెంచువారు దానిని రెండుకప్పెక్లలో పెట్టుకొని ఊపిరి పోయుదురు. అట్లే తండ్రి చేయును.
యేసు ప్రభువు నేనూ జీవమునై యున్నానని చెప్పుటనుబట్టి ఆయన తండ్రికూడ అయియున్నట్లు తెలియగలదు.
ఇదే ఆయన దైవత్వమునకు రుజువు. (2) యేసుప్రభువు జీవమై యున్నాడు. ఎట్లనగా ఆయనను శత్రువులు
దండించినప్పుడు, చంపినప్పుడు భూస్థాపన చేసినప్పుడు ఊరుకొన్నాడు గాని మూడవనాడు వెలుగుకివచ్చినాడు.
అప్పుడు ఆయన జీవమైయున్నాడని తెలిసినది. ప్రభువు యొక్క సేవలో చేసిన అద్భుతకార్యము లన్నియు
ఆయన జీవమైయున్నాడని రుజువు పరచును. మరియు పునరుత్థానకాలమందు అనగా రాకడలో అందరిని ఆయన
లేపినప్పుడు ప్రభువు జీవమై యున్నాడను సంగతి మరింత ఎక్కువగా తెలిసికొందము
(3) రోమా 8:2 లో జీవమునిచ్చు ఆత్మ అని
వ్రాయబడి యున్నది. గనుక పరిశుద్ధాత్మకూడ జీవమైయున్నాడు.
2. మార్గము : (1) తండ్రిమార్గమై యున్నాడు, ఆదాము హవ్వలు పాపముచేసి
చెట్టుచాటున దాగిరి వారు చెట్టుదగ్గరకు వెళ్ళకుండా దేవునిదగ్గరకు వెళ్ళవలసిన మార్గమువారికి
తెలియలేదు గనుక ఆయననే స్వయముగావచ్చి, పలకరించి, రక్షించి తనచెంత చేర్చుకొనెను. అందుచేతనే
తండ్రి మార్గమైయున్నాడు. తండ్రి కుమారుని పంపినందువలన విశ్వాసికి పరలోకమునకు వెళ్ళే
మార్గమేర్పడినది. ఆ మార్గము నేర్పరచినవాడు తండ్రిగనుక తండ్రిమార్గమైనాడు. తండ్రి కుమారుని
పంపినట్లు ఆత్మనుకూడ పంపియున్నాడు గనుక ఆ పంపుటవల్ల మార్గమేర్పడెను. గనుక తండ్రి మార్గమైయున్నాడు.
(2) క్రీస్తుప్రభువు మార్గమైయున్నాడు. ఇది చాలా స్పష్టముగా ఉన్నది, ప్రభువు మనుష్యులకు
కనబడి ఏలాగునడువవలెనోచెప్పి నడిచి చూపించెను. కాబట్టి అందరు ఆయన అడుగు జాడలలో నడువవచ్చును.
నన్ను వెంబడించుము అని ప్రభువు సుంకపు మెట్టుదగ్గరనున్న మత్తయితో చెప్పినప్పుడు మత్తయి
మెట్టువిడిచి ప్రభువుకూడ వెళ్ళెను. ప్రభువుముందు నడచుట, మత్తయి ఆయన వెనుకపోవుట అదేమార్గము.
యేసుప్రభువు మార్గమని దీనివలన తెలియుచున్నది. ప్రభువు యొక్క ధర్మోపదేశము, ఉపకారకార్యములు,
జనులసహవాసము, శ్రమానుభవము, పునరుత్థానము యివన్నియు కలిపి ఒక బాటై యున్నది. ప్రభువు
ఇట్లు నడిచి చూపించెను గనుక ఇది ఒక బాటైయున్నది. ఆయన చివరగా ఆరోహణమాయెను. అదే పరలోకమునకు
మార్గము. రేపు సంఘము కూడ ఈ మార్గముననే పరలోకమునకు వెళ్ళును. వీటన్నిటినిబట్టి యేసుప్రభువు
మార్గమైయున్నాడు. (3) పరిశుద్ధాత్మ మార్గమైయున్నాడు. ఆయన వచ్చినప్పుడు సర్వసత్యములోనికి
మిమ్మును నడిపించును. గనుక పరిశుద్ధాత్మ మార్గమై యున్నాడు. యూదుల భయము చేత 120 మంది
తలుపు వేసుకొనిరి అప్పుడు పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను వారు తలుపులు తీసుకొని విరోధులయొద్దకు
బాటవేసుకొని వెళ్ళిరి. ఎవరు నడిపించుకొని వెళ్ళిరో ఆయననే మార్గమై యున్నాడు. అనగా ఆత్మయే
నడిపించుకొనివెళ్ళెను ఆత్మను పొందిన పిమ్మట ఒక్క యెరూషలేము వీధులోనికి మాత్రమే కాక
యూదయ, సమరయ, గలిలయకు, చిన్న ఆసియాకును, తుదకు సమస్త రాష్ట్రములకును, భూదిగంతముల వరకును
బాటవేసుకొని వెళ్ళియున్నారు. ఇదంత యెవరి శక్తి? ఈ పాయ (మార్గము) చేసినదెవరు? ఆత్మగనుక
ఆయనమార్గమైయున్నాడు. మరియు దేవుని వాక్యమునకు అర్థము తెలియనప్పుడు ఆత్మ తండ్రి భోధించి,
తేట పర్చుట ఒకమార్గమైయున్నది. ఆయనమాట మనకు బాట.
3. సత్యము : (1) తండ్రి సత్యము. సత్యము అనగా నిజముగా జరిగిన సంగతి.
తండ్రిచేసిన పని అనగా సృష్టి మనకంటికి కనబడుచున్నది కాదనలేము. సృష్టినిబట్టి తండ్రి
సత్యమని ఋజువగుచున్నది, యోహాను 1 : 3 లో సత్యదేవుడు అని వ్రాయబడియున్నది. సత్యము ఆయన
యొద్దనుండి వచ్చినదే సత్యమనగా (2) కుమారుడు సత్యము. యేసుప్రభువు చేయునది సత్యమని యోహాను
8 అధ్యాయములో నున్నది. క్రీస్తుయొక్క జీవితచరిత్ర
అనగా నలుగురు సువార్తికులు వ్రాసిన చరిత్ర నిజముగా జరిగినదని అవిశ్వాసియైన ఒక యూదుడు
(జెసిఫస్) గొప్ప గ్రంథము వ్రాసెను. క్రీస్తుచరిత్ర సత్యముగనుక ఆయన సత్యమైయున్నాడు
(3) పరిశుద్ధాత్మ: ఆత్మ సత్యము సత్యస్వరూపియైన ఆత్మ అని యోహాను 16:13లో స్పష్టముగా
కనబడుచున్నది. మీరు సత్యమంతయు గ్రహింతురు అని కూడా గలదు. గనుక ఆత్మతండ్రి మనము సత్యము
గ్రహించునట్లుగా చేయును. కనిపెట్టు గంటలో దేవుని చిత్తమును తెలియపరచును. అనేకులు అనేకరీతులుగా
చెప్పుచున్నప్పుడు ఏది సత్యమైనది తెలియనప్పుడు కనిపెట్టు గంటలోనుండిన పరిశుద్ధాత్మయే,
అనగా సత్యాత్మవచ్చి తెలియపర్చును—తండ్రి సత్యమని సృష్టివలనను, కుమారుడు సత్యమని స్వీయచరిత్రవలనను,
ఆత్మ సత్యమని సంఘచరిత్రవలనను బాహటమగుచున్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, మార్గము,
సత్యము, జీవమునై యున్నారు ఈ మూడుఅయియున్నానని ప్రభువుయొక్క మాటలలో కనబడుచున్నది. త్రిత్వము
అను దైవత్వము క్రీస్తుప్రభువులో ప్రత్యక్షమైనట్లు ఈ వాక్యములో కనబడుచున్నది అనగా క్రీస్తు
ప్రభువులో తండ్రి కలడు, ఆత్మకలడు అనిఅర్థము. నాతండ్రి పనులమీద నేనుండవలెనని మీ రెరుగరా
అని భూమిమీద ప్రభువు మాట్లాడిన మొదటి మాట వ్రాయబడియున్నది. అది వ్రాతలోనున్న ప్రభువుయొక్క
మొదటి మాట. ఆ వాక్యములో ప్రభువుయొక్క దైవత్వము కనబడుచున్నది. నేనే మార్గము, సత్యము,
జీవము అను వాక్యములో ఆయన దైవత్వముయొక్క నిజము ఉన్నది. యెషయా 4:5లో "వితానము"
అని ఉన్నది. వితానము అనగా కాపుదల కప్పు. మనిషిమీద ఇది విప్పబడియున్నది, గనుక బయటికి
పోవుటకు దుర్జనునికి సందు లేదు. మనిషిని కాపాడుటకు తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ
వితానముగా నున్నారు. ఉదా: పారిపోవుచున్న కుర్రవానిని అడ్డగించుటకు ముగ్గురు మూడు ప్రక్కలనుండి
అడ్డముగా వచ్చునట్లు పాపులమైన మనము దేవుని యొద్దనుండి పారిపోకుండా త్రియేకదేవుడు అడ్డముగావచ్చును.
ఆ పారిపోయే కుర్రవాడు అడ్డగించు వారిని ఎదిరించిన వదిలి పెట్టివేయును, వాడు చెడిపోవును.
అలాగే అనేకులు దేవుని వితానమును ఎదురించి చెడిపోవుచున్నారు.
ప్రార్థన : ఓ తండ్రీ మేము తప్పిపోవుచున్నప్పుడు
నీ మార్గము అడ్డబడుననియు, తప్పుబోధలలో కొట్టుకొనుచున్నప్పుడు నీ సత్యము అడ్డబడుననియు,
నిత్యనాశనమరణమునకు కొట్టుకొని పోవుచున్నప్పుడు నీ జీవము అడ్డుబడుననియు మేము తెలిసికొని
నీకు వందనములు ఆచరించుచున్నాము. ఆమేన్.

