తైలాభిషేక ప్రసంగము
తైలాభిషేక
ప్రసంగము
క్రీస్తు తన ఆత్మతో మిమ్ములను అభిషేకించి
ఆయత్తపరచును గాక! ఆమెన్.
“తైలాభిషేకము” అనుమాట ధ్యానించునప్పుడు
మనము కొన్ని విషయములు జ్ఞాపకము చేసికొనవలసిన వారమైయున్నాము. బైబిలు గ్రంథమునందు తైలాభిషేకము
ఎవరికి, ఎందుకు, ఎప్పుడు జరిగినదో ధ్యానించవలెను. పరిశుద్ధ గ్రంథమునందు కొన్ని ముఖ్యమైన
తైలాభిషేకములను పరిశీలిద్దాము.
* యాకోబు రాయితీసి స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఆది 28:12–18
* మోషే ప్రత్యక్షపు గుడారమును, అందులోని వస్తువులను యాజకులను
అభిషేకించెను. నిర్గ 40:9
* ముఖ్యముగా మానవుల విషయములో 3 రకములవారు అభిషేకింపబడినట్లు కనబడుచున్నది.
ఎ)
ప్రవక్తలు అభిషేకింపబడిరి 1 రాజు 19:16
బి)
యాజకులు అభిషేకింపబడిరి నిర్గ 29:7
సి) రాజులు అభిషేకింపబడిరి 1 సమూ
10:1
డి)
మన ప్రభువైన క్రీస్తుకూడా అభిషేకింపబడియున్నారు. లూకా 4:18; అ.కా 10:38
ఈ తైలాభిషేకము ప్రభువుయొక్క ఏర్పాటును,
ఆత్మాభిషేకమును సూచించుచున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు పైన చెప్పబడిన 3 రకముల వారికి
సరిపోయియున్నాడు. ఆయన ఈ లోకములో నున్నపుడు ప్రవక్తయై యున్నాడు కనుక దేవుని ఉద్దేశమును
చెప్పేవాడు ప్రభువు ఆరోహణుడై యిప్పుడు పరలోకములో ప్రధాన యాజకుడై యున్నాడు. తిరిగి వచ్చినప్పుడు
యీ లోకములో తన సింహాసనమును వేసుకొని రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను పాలించును.
పై 3 అభిషేకములకు ప్రభువు తగియున్నారు. గనుక ఈ తైలాభిషేకము కొన్ని ప్రత్యేకమైన కారణాలనుబట్టి
జరుగుచున్నదని చెప్పవచ్చును. అవేవనగా—
1.
ప్రత్యేకించుటకు 2. ప్రతిష్టించుటకు 3. ప్రార్థించుటకు 4. ప్రకటించుటకు 5. ప్రవచించుటకు
6. పరిపాలించుటకు.
1.
ప్రత్యేకించుటకు :- ఈ తైలాభిషేకము ద్వారా ఒక పనికి ఒక వ్యక్తిని ప్రత్యేకించుట
అనునది జరుగుచున్నది. మోషే: ప్రత్యక్షపు గుడారమును, అందలి వస్తువులను, యాజకులను ప్రతిష్టించినప్పుడు
వారు ఆపని కొరకు ప్రత్యేకించబడిరి. సర్వజనాంగము నుండియు, సర్వవస్తువుల నుండియు వారును
మరియు ఆ వస్తువులును ప్రత్యేకించబడినారు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన తరువాత
కూడా మనము ప్రత్యేకించబడుచున్నాము. పేతురు మేడ గదిలో పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన
తరువాత ప్రసంగించుచు ఈ వరమును పొందుటకు మీరు ప్రత్యేకించబడవలెనని చెప్పుచున్నారు. అ.కా
2:57-40 అభిషేకము పొందిన వారలారా మీరు ప్రత్యేకించబడినవారని జ్ఞాపకముంచుకొనుడి. మీ
పరిశుద్ధమైన ప్రత్యేకతను కాపాడుకొనండి. వేటినుండి ప్రత్యేకించబడవలెనో జాగ్రత్తగా పరిశీలించుకొనండి.
దేవుడు తాను ఏర్పాటు చేసికొనుచున్న ప్రతీ వ్యక్తిని, జనాంగమును ముందుగా ప్రత్యేకించు
కొనినదే వారి విషయములో ఏమియు చేయలేదు. ఉదా : అబ్రహాము, ఇశ్రాయేలీయులు.
2.
ప్రతిష్టించుటకు:- ప్రత్యేకించబడిన తరువాత ఆపనికొరకు ప్రతిష్ఠింపబడుచున్నాము.
ఒక పనికొరకు శాశ్వతముగా స్థాపించుట లేక నిలుపుట లేక ఏర్పాటు చేయుటే ప్రతిష్ఠ. గనుక
"తైలాభిషేకమును" పొందుచున్న వారు ఆపనికొరకు ప్రతిష్ఠింపబడుచున్నారు. అపొస్తలుడైన
పౌలు రోమా 6:19-20 వచనములలో "మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు"
అని చెప్పుచున్నారు. కనుక మనము ప్రభువు కొరకునూ, ఆయన పనికొరకునూ ప్రతిష్ఠింపబడినవారము.
ప్రియమైన విశ్వాసీ, నీవు ఆయన సంఘములో ఏపని కొరకు ప్రతిష్ఠింపబడినావో గుర్తించినావా?
ప్రాణప్రియునిలో మనందరము అనాదిలోనే ప్రత్యేకించబడి ప్రతిష్ఠింపబడినాము. ప్రత్యేకించబడి,
ప్రతిష్ఠింపబడిన మనము ఎట్టి పనులు కొనసాగించుచున్నామో ఆలోచించండి.
3.ప్రార్థించుటకు:-ప్రవక్తలుగాను,
యాజకులుగాను, రాజులుగానూ అభిషేకింపబడినవారు తమ ప్రజలకొరకు, సంఘముకొరకు, ఆత్మీయ సంతానముకొరకు
నిత్యము "విజ్ఞాపన ప్రార్థన" చేయవలసినవారమై యున్నారు. ఈలాగున ప్రార్థించుట
ద్వారా తన ప్రజలను తాము రక్షించుకొనగలరు.
ప్రధాన యాజకుడైన అహరోను 12 గోత్రముల వారికొరకు
విజ్ఞాపనచేయుట, ప్రవక్తయైన సమూయేలు, ఎలీషా, మోషే వీరందరూ తమ ప్రజలకొరకు విజ్ఞాపనలు
జరిగించినట్లు వాక్యములో మనము తెలుసుకొనగలము. "రూపాంతర మహిమ" ఆగష్టు సంచికలో
"ఏఫోదు" గురించి వ్రాయబడిన అంశములో సంఘ కాపరి విశ్వాసుల భారము భరించి విజ్ఞాపన
ప్రార్థన చేయవలెను అని వ్రాయబడియున్నది కదా! గనుక ప్రియ పాఠకులారా, సంఘ కాపరి, రాకడలో
ఆయత్తపడవలెనని ఆశ కలిగిన పెండ్లికుమార్తె సంఘమా, విజ్ఞాపనను విడువవద్దు. నీ విజ్ఞాపనే
అనేక నశించుచున్న
ఆత్మలకు రక్షణ కాగలదు, అంతేకాదుగాని పరలోకమoదు
అధిక మహిమ కళను చేకూర్చగలదు. యేసు శిష్యుడైన యాకోబు ప్రార్థనా వీరుడు. ఆయన చనిపోయిన
తరువాత ఆయన శవమును మోసుకొని వెళ్లుచున్నపుడు చూడగా ఆయన మోకాళ్లు ఒంటె మోకాళ్లవలె ఉన్నవని
చెప్పుదురు. ఆత్మాభిషేకము కలిగినవారు నిత్యమూ ప్రార్థించకుండా ఉండలేరు.
4.
ప్రకటించుటకు :- సాధారణముగా యాజకుడు, బోధకుడు, ప్రవక్త దేవుని వాక్యమును
ప్రజలకు ప్రకటించవలసినవారై యున్నారు. “ఆత్మాభిషేకమును పొందేవరకు ప్రకటించుటకు వెళ్లవద్దు” అని శిష్యులైన
వారికి ప్రభువు ఆజ్ఞాపించినారు. గనుక ఆత్మాభిషేకమును పొంది సర్వసృష్టికి మనము ప్రభువు
సువార్తను ప్రకటించవలసిన వారమైయున్నాము. సమయమందు, అసమయమందు సువార్తను ప్రకటించుట మంచిది.
“అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుము”అనేవాక్యానుసారమైన
ఆజ్ఞ, దైవజనులైన దేవదాసు అయ్యగారి ఆజ్ఞ నేటికాలమందు ఎందరు పాటించుచున్నారు. కడవరి కాలములో
ఉన్న పెండ్లికుమార్తె సంఘమా ప్రకటించుటకు పరుగులెత్తండి. మా తండ్రిగారైన రెవ. యస్.
సమూయేలుగారు బైబిలుమిషనును, దేవదాసు అయ్యగారి ఉపదేశములు అందించుటకును భారత దేశములోని
ప్రధానపట్టణము లన్నింటికి సువార్త దండయాత్రలు సాగించారు. ప్రకటించుటకు పరుగులెత్తండి.
5.
ప్రవచించుటకు :- “ప్రజలకొరకు దేవుని సన్నిధానమందు మాట్లాడేవారు యాజకుడైతే,
ప్రవక్తలు దేవుని పక్షముగా నిలువబడి ఆయన మాటను ప్రజలకు అందించెడివారు రాబోవు సంగతులను
తెలిపెడివారు ప్రవక్తలుగా పిలువబడిరి. ఏది ఏమైనప్పటికిని యాజకులును, ప్రవక్తలును ఒకరిపనినొకరు
పూర్తిచేసుకొనుచుండిరి. గనుక ఆత్మాభిషేకము పొందినవారు ప్రవచించువారైకూడా ఉండవలెను.
దైవసన్నిధానమందు మనము ప్రశ్నలు వేసి, ప్రభువు సమాధానముకొరకు కనిపెట్టినపుడు ఆయనే స్వయముగావచ్చి,
రాబోవు సంగతులను, ప్రవచించవలసిన సంగతులను తెలియచేయును. గనుక ఆత్మాభిషేకము పొందిన ప్రతి
ఒక్కరూ దైవ సన్నిధానమందు కూర్చుండి గూఢమైన సంగతులు ప్రభువు యొద్దనుండి అందుకొని ప్రజలకు
అందించేవారై యుండవలెను. దైవజనులైన దేవదాసు అయ్యగారు ఒక కీర్తనలో ఈలాగు వ్రాసినారు.
“సభను గురించియున్నా - ప్రభుని గురించియున్న = శుభ వార్త వినుచు చెప్పచు సుఖియింపగలను” || షారోను
||
6.
పరిపాలించుటకు : రాజులు సహితము అభిషేకింపబడుట మనము వాక్యమునందు గమనించగలము.
గనుక ఈ ఆత్మాభిషేకము ద్వారా మనము క్రీస్తుతో కూడా పరిపాలించుటకు ఏర్పరచబడుచున్నాము.
“మీకు అధికారము అనుగ్రహించి యున్నాను” (లూకా
10:19) అని ప్రభువు చెప్పుచున్నారు. యుగయుగములు క్రీస్తుతో కూడా పరిపాలించుటకు భూలోకమందు
శిక్షణ పొందుచున్న పెండ్లి కుమార్తె సంఘమా ఏశక్తియు నీయెదుట నిలువనేరదు అనే విషయమును
గ్రహించి ధైర్యము కలిగినవారమై పైన వ్రాయబడిన 6 పనులు చేయుటకు అభిషేకింపబడియున్నాము.
అభిషేకింపబడుచున్నాము. గనుక పరిపాలించుటకు ఏర్పాటు చేయబడిన వారలారా, దేవుని విషయములో
దాసులవలె ఉండి శత్రువుల విషయములో రాజులవలె ఉండి కొనసాగండి. ప్రభువు సింహాసనమందు ఆయనతో
పాటు కూర్చుండి (ప్రక 3:21) - పరిపాలించుటకు పెండ్లికుమారుడు మనలను అభిషేకించియున్నారు.
