దైవజ్ఞానోపాయము
[యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము 1944 సం॥ము]
క్రిస్మస్ నిరీక్షణాసక్తులైన విశ్వాసులారా!
మీకు క్రిస్మస్ శుభములు కలుగుగాక: మరనాత.
ప్రియులారా! దేవలోక వాసియైన ప్రభువు నరలోకవాసులమైన మనలను రక్షించుటకు నరుడుగా పుట్టిన పుట్టుకను తలంచుకొని మనము క్రిస్మస్ పండుగను చేయుచున్నాము. యేసుప్రభువు నా కొరకు పుట్టియున్నాడని సంతోషించుటయే అసలైన క్రిస్మస్ పండుగ. “ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగస్తువలన ఆజ్ఞ ఆయెను.” లూకా 2:1
ఈ వాక్యములో దేవుని యొక్క జ్ఞానోపాయము కలదు. ఇందులో మూడు భాగములు కలవు.
1. సర్వలోకము
2. ప్రజాసంఖ్య
3. కైసరు ఔగస్తు అను మూడింటినిగూర్చి
ధ్యానించుకొందము.
1.
సర్వలోకము:— అనగా ఆ కాలపు ప్రపంచము ఈ ప్రపంచమును యావత్తు రోమా గవర్నమెంటువారిచే
పరిపాలింపబడుచుండెను. ఆ కాలపు రోమా చక్రవర్తి కైసరు ఔగస్తు (సీజరు ఆగస్టస్) రక్షణ చరిత్రలో
సర్వలోకమనేది ప్రాముఖ్యమైనమాట. భూలోక సంబంధి అయిన అధికారి తన అధికారమును, ఆధిపత్యమును
వెల్లడించుకొను సమయములో దేవుడు తన సంకల్పమును తాను జరిగించుకొనెను. ఉదా:— హిందువుల
పండుగలు జరుగునప్పుడు క్రైస్తవులు వీధి ప్రసంగములు చేయుచున్నారు. వేలాది పత్రికలను
పంచిపెట్టుచున్నారు. సాతానుపని యొకవైపున జరుగుచుండగా దేవుడు తనపనిని తనసేవకుల ద్వారా
మరియొక ప్రక్కనుండి ఆశ్చర్యకరముగా జరుపుకొనుచున్నాడు. ఇది దేవుని జ్ఞానోపాయము సర్వలోక
ప్రజాసంఖ్యకాలములో సర్వలోక రక్షణార్థమై సర్వలోకరక్షకుడు జన్మించెను. ఈ రక్షకుడు ఒక
గ్రామమునకు, పట్టణమునకు, ఒకదేశమునకు, ఒక జనాంగమునకుకాదు. సర్వలోకము రక్షింపబడవలెననెడి
కోరిక ఆయనకు కలదు. కాబట్టి ఈయన సర్వలోకైక రక్షకుడు. ఉదా:— మన కుటుంబములోని వారందరు
రక్షింపబడవలెనని మనము కోరుదుముగదా? అందరి రక్షణ కోరువారే నిజమైన క్రిస్మస్ ఆరాధనపరులు.
క్రిస్మస్ బాలుడైన ప్రభువు తాను భూలోకమును విడిచి పరలోకమునకు వెళ్లునప్పుడు మీరు సర్వలోకమునకు
వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడనెను.. మనలోకములో మన సంఖ్యలో ప్రభువు చేర్చబడినాడని
సంతోషించుటయే క్రిస్మస్. అలాగే మనము ప్రభువు సంఖ్యలో పరలోకమునకు సిద్ధపడిన ప్రభువునకు
సంతోషము. పరలోక వాస్తవ్యులకు సంతోషము.
2.
ప్రజాసంఖ్య:— సర్వలోకములో ప్రజాసంఖ్యవ్రాయుట యనునది ప్రాముఖ్యమైనమాట. ఆకాలపు ప్రజల
యొక్క సంఖ్యను తెలిసికొనుటకును రోమాప్రభుత్వపు పౌరసత్యమును వృద్ధిచేయుటకుగాను ప్రజాసంఖ్య
వ్రాయబడెను. ఒకదేశమునకు జనాంగములకు మాత్రమేగాక సర్వజనాంగముల యొక్క ప్రజాసంఖ్య పురజనులు
రక్షింపబడినవారు. రాకడకు సిద్ధపడినవారిసంఖ్యలో నుండవలసినదే. సర్వలోకసంఖ్యలో భక్తులసంఖ్య,
మారుమనస్సుపొందినవారి సంఖ్య, రాకడకు సిద్ధపడినవారిసంఖ్యకూడ తయారుచేసిన ఎంత బాగుండును.
ప్రజాసంఖ్య యెక్కువేగాని రక్షింపబడినవారి సంఖ్య చాలా తక్కువగాయుండును. నేటికాల ప్రపంచజనాభా
మూడువందలకోట్లు ఇందులో వందకోట్లు క్రైస్తవులు. రక్షింపబడినవారి జాబితా ఎంత? మనమేజాబితాలోయున్నాము.
లోకజాబితాలోనా పరలోకజాబితాలోనా? అంత్య దినమందు దూత బూరనూదుచు రక్షణందుకొన్న వారి పేర్లు
పిలుచుచుండగా నేనుకూడ చేరియుందునచట అను విశ్వాసము మనకున్నదా? యేసుప్రభువువలన నేను రక్షింపబడినానను
నిశ్చయముగలవారు తప్పక వెళ్ళుదురు. ఒక వేళ ఎవరైనా నీవు పాపివి నీకేలాగురక్షణ అంటే? నేను
మారుమనస్సు పొందియున్నాను అనగా యేసుప్రభువువలన రక్షింపబడి నానని ధైర్యముగ చెప్పవలయును.
మీరు ముందున్న నా దుస్థితిని చూచుచున్నారుగాని యిప్పటి ఉన్నతస్థితిని చూచుటలేదు. నేను
యేసుప్రభువు వలన రక్షింపబడినాను నిశ్చయము నాకున్నది. కాబట్టి పరలోకజాబితాలోనికెళ్ళెదను.
ఇటువంటి సంపూర్ణ నిశ్చయము కలవారే ప్రభువుయొక్క జనసంఖ్యలో నుందురు. ఒకవేళ చనిపోయినను
తప్పక మోక్షమున కెళ్ళెదమను తలంపు కలిగియుండవలెను. ఇటువంటివారే నిజమైన క్రిస్మస్ పండుగను
చేయువారై యుందురు. మరికొందరు రక్షింపబడకపోయిన రాకడకు సిద్ధపడకపోయిన పైకి గట్టిగా చెప్పుదురుగాని
రాకడ సమయములో తేలిపోవును కాబట్టి సర్వలోక జనాంగము రక్షింపబడిన రక్షింపబడకపోయిన ప్రభువు
మాత్రము సర్వలోకైక రక్షకుడు. ఉదా:— పంతులుగారు స్కూలులో బాగుగా బోధించిన బోధించకపోయిన
పంతులుగారే. కొందరు విద్యార్థులు ప్యాస్కావచ్చు ప్యాస్ కాకపోవచ్చు. లోపమెవరిది? విద్యార్థులదే
పంతులుగారు పంతులుగారే. అలాగే యేసుప్రభువును అందరు అంగీకరించినా అంగీకరించకపోయిన ఆయన
రక్షకుడు. యేసుప్రభువు మంచివాడే రక్షకుడే దేవుడేయందురుగాని కొందరంగీకరించరు. మానవ జనాభాలెక్కికలలో
ఆయన పుట్టియున్నాడు. కాబట్టి అందరు అంగీకరించి సంతోషించవలసిన సుదినము. దేవుడు మన మానవజాబితాలోనికి
వచ్చినాడు. కాబట్టి క్రిస్మస్ పండుగను చేయుచున్నాము.
3.
సర్వలోక చక్రవర్తి:— ఆ కాలపు రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తి సీజరు ఆగస్టస్.
యూదాప్రాంతమునకు హేరోదు, సిరియాకు కురేనియా వీరి కాలములోనున్న సర్వలోక ప్రజాసంఖ్య వ్రాయబడెను.
దేవుడు లోకములో నొక సంగతి జరుగునప్పుడు ఆయన తన పనిని తాను జరిగించుకొనును. ఆ చక్ర వర్తికి
దేవుడే ప్రజల జాబితాను సిద్ధపరచుమను తలంపు కలిగించెను. కాబట్టి గవర్నరులందరికి తాకీదులు
పంపించెను. ఈ వార్త వినగానే యూదులందరు సంతోషించిరి. యూదులకు పండుగ ఎందుకంటే మరల మనము
మన పితా మహులదేశమునకు వెళ్ళుచున్నామను సంతోషము. రోమా గవర్నమెంటు పద్ధతి ప్రకారము ఎచ్చట
నివాసము చేయుచున్నారో యచ్చటనే వారి కుటుంబ లెక్కలు వ్రాయించుకొనవలయును. యూదుల పద్ధతియైతే
వారి మాతృదేశమున కెళ్ళవలయును.
పాలస్తీనాదేశములోని గలిలయ జిల్లాలోని
నజరేతు గ్రామమునుండి సుమారు 80 మైళ్ళ దూరములోనున్న యూదయ జిల్లాలోని బెత్లేహేమను
దావీదు ఊరికి వెళ్ళవలయును. ఎందుకనగా నీతిమంతుడైన యోసేపు దావీదు వంశము లోను గోత్రములోను
పుట్టినవాడు గనుక నీతిమంతురాలైన, గర్భవతి అయిన మరియమ్మను తనతో తీసుకొని వెళ్ళెను. బెత్లేహేమనగా
రొట్టెల ఇల్లని అర్థము. అందరికి స్థలమున్నది. గాని జీవాధిపతి అయిన నిర్జీవపురొట్టె
అయిన ప్రభువునకు స్థలములేదు. మరియమ్మ ప్రజాసంఖ్యనిమిత్తమై బెత్లేహేమునకు రాగానే కాలము
సంపూర్ణమాయెను. ప్రవక్తల ప్రవచనములు నెరవేరినవి. దేవుడు అది తల్లిదండ్రులకిచ్చిన వాగ్దానము
నెరవేరినది. ఎన్ని అడ్డంకులు ఆటంకములున్న దేవుడు తన మాటను తప్పక నెరవేర్చుకొనును. సత్రములో
వారికి స్థలములేదు కావున పశువులశాలలో వారు బసను ఏర్పాటు చేసుకొనిరి. ఇచ్చట ప్రభువు
జన్మించెను. పరలోకమంతయు సంతోషించెను. ప్రవచనము వ్రాసిన మీకా మరింత సంతోషించెను. ఎందుకు
తాను వ్రాసిన ప్రవచనము నెరవేరినది. ప్రభువు భూలోక మానవుడుగా జన్మించినాడు కాబట్టి భూలోకపు
ప్రజాసంఖ్యలో ప్రభువు పేరుకూడ లిఖించబడెను. కనుక మనుష్యకుమారుడని బిరుదుపొందెను. సర్వలోకమునకు
సర్వకాలమునకు వర్తించు ప్రజాసంఖ్యలో అనగా మన జాబితాలోనికి వచ్చివేసినాడు. ఎందుకనగా
మనలను రక్షించి పరలోక జీవగ్రంధములో మన పేర్లను లిఖించుటకొరకే వచ్చెను. ఎవరిపేరు జీవగ్రంధములో
యుండదో వారి అగ్నిగుండములో పడవేయుదురు. కాబట్టి అట్టి రెండవ మరణమునుండి రక్షించుటకు
వచ్చిన రక్షకుని జన్మదినమే క్రిస్మస్ దినము. ఇదియే దేవుని జ్ఞానోపాయము.
