Skip to main content

ప్రభువు పరలోక ప్రార్థన

భాగములు:

I. పిలుపు-పరలోకమందున్న మా తండ్రీ!

II. మనవి లేక ప్రార్ధన:

1. దేవుని గురించిన మనవులు:

a) నీ నామము పరిశుద్ధపరచబడును గాక!

b) నీ రాజ్యము వచ్చునుగాక!

c) నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక!

2. మన శరీర జీవనమును గురించిన మనవి:

a) మా దినాహారము నేడు మాకు దయచేయుము.

3. మన ఆత్మీయ జీవనమును గురించిన మనవులు:

a) మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము, మా ఋణములను                      క్షమించుము.

b) మమ్మును శోధనలోకి తేకుము.

c) కీడు నుండి తప్పించుము.

III. స్తుతి: రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవియైయున్నవి.

మొత్తముమీది భాగములు: 1) పిలుపు 2) దేవుని గురించిన ప్రార్ధన. 3) మన శరీర జీవనమును గూర్చిన ప్రార్ధన 4) మన ఆత్మీయ జీవనమును గూర్చిన ప్రార్థన 5) స్తుతి.

I) పరలోకమందున్న మా తండ్రీ: 'మా' అని పిలుచుటలో ప్రభువు సంఘమును పరలోకమునకు తీసికొని వెళ్ళుచున్నట్లు కనబడుచున్నది. 'మా' అనగా విశ్వాసులందరు కలిసి, దేవుని తండ్రీ! అనుట, వారిలోని ఏకీభావమునకు గుర్తు. పిల్లలు మా నాయన అందురుగాని నా నాయన అని అనరు. తండ్రీ అనుటలో వరస కనబడుచున్నది. అనగా దేవుడు, విశ్వాసుల తండ్రి అని కనబడుచున్నది. సృష్టినిబట్టి ఆయన అందరికీ తండ్రి. అయితే ఆయనను అంగీకరించినవారు 'మా తండ్రీ!' అని అనుటలో ఆయన విశ్వాసుల యొక్క తండ్రి అనికూడ కనబడుచున్నది. ఆ తండ్రి పరలోకములో నున్నాడు గనుక విశ్వాసి ప్రార్ధించునప్పుడు, తాను పరలోకమునకు వెళ్ళి తండ్రిని పిలుచుచున్నట్టు భావించు కొనవలెను. మత్తయి 23:9లో భూమిమీద ఎవరిని 'తండ్రి' అని పిలువవద్దని ప్రభువు చెప్పెను. అనగా పరలోకపు తండ్రిని, భూలోకపు తండ్రులతో సమానము చేయవద్దని అర్థము. భూలోకపు తండ్రులను కొట్టివేయవలసియుంటే, కన్న తండ్రిని కూడ కొట్టివేయ వలసి యుండును. పరలోకమందున్న తండ్రిని పిలుచునప్పుడు; పిల్లలు తమ తండ్రిని ఎంత చనువుగా ప్రేమతో పిలుతురో, అట్లు మనమును ఆయనను పిలువవలెను. మనము పాపాత్ములము గనుక న్యాయ ప్రకారము చూచిన అంత చనువుతో మనము ఆయనను పిలువకూడదు. గాని క్రీస్తు ప్రభువు మూలమున ఆయన మనకు తండ్రియైనాడు గనుక ఆ చనువు వచ్చినది.

II) ప్రార్థన లేక మనవి: ఈ భాగములో 1. దేవుని గురించిన మూడు మనవులు గలవు.

a) మనవి: 'నీ నామము పరిశుద్ధ పరచబడును గాక!' దేవుడు, ఆదినుండి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలము వరకు దేవుడుగానే ఉండెను అనగా చాటుగానుండెను. అయితే మోషే కాలములో పొద దగ్గర ఆయన నామము బయలు పరచబడెను. నేను 'ఉన్నవాడను' అనియు తర్వాత 'యెహోవా' అనియు బయలుపడెను గనుక ఆయన నామమునకు మహిమ కలుగవలెను. తరువాత 'యేసు' అను నామము సువార్తలలో బయలు పడెను. అపోస్తలులు కాలములో, పత్రికలలో 'క్రీస్తు' అను నామము బయలు పడినది గనుక ఆయన నామమునకు మహిమ కలుగవలెను. పరిశుద్ధ పరచబడును గాక అనగా నామమునకు ఘనత కలుగును గాక! ఆయన నామము పరిశుద్ధ పరచబడకుండుటకు అనేక చిక్కులు గలవు. కొందరు సృష్టిని పూజించుట వలన దేవుని నామము ఘనపరచబడుట లేదు. మరియు ఇతర మత గురువులును, ఇతర దేవుళ్ళని పిలువబడువారును, ఆయన నామము ఘనపరచబడుటకు అడ్డుగా నున్నారు. ఈ అడ్డులన్ని పోయినప్పుడే ఆయన నామము పరిశుద్ధ పరచబడును. గనుక ఈ అడ్డులన్ని, చిక్కులన్ని పోయి, ఆయన నామము పరిశుద్ధ పరచబడును గాక అని మనము ప్రార్థించవలెను. మనము ప్రార్ధన చేయునప్పుడు ఇవన్ని తలంచుకొనవలెను.

b) మనవి:- 'నీ రాజ్యము వచ్చుగాక' అనగా ఆయన సంఘము వృద్ధిపొందును గాక, ఆయనను నమ్మిన వారి గుంపు వృద్ధి అగునుగాక అని అర్ధము. ప్రభువును గూర్చి అందరికిని తెలిసినప్పుడు, అనేకులు రక్షణను అంగీకరించి, సంఘములోనికి ప్రవేశింతురు. ఈ సంఘమే ప్రభువుయొక్క రాజ్యము. 'నీ రాజ్యము వచ్చునుగాక' అన్నప్పుడు, అన్ని మిషనులు చేయు సువార్త పనిని దీవించుము అని జ్ఞాపకముంచుకొని ప్రార్థించవలెను. ఆయన రాజ్యము వ్యాపించుటకున్న ఆటంకములను తొలగించుమని కూడ జ్ఞాపకము ఉంచుకొని ప్రార్ధించవలెను.

c) మనవి:- 'నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక!' పది వేలమందిలో ఒక్కరుకూడ, పరిపూర్ణముగా ఆయన చిత్తమును నెరవేర్చుటలేదు. గాని వెయ్యేండ్ల పాలనలో ఆయన చిత్తము చాలమట్టుకు నెరవేరును. దేవుని చిత్తము నెరవేరకుండుటకు శరీరము, మనస్సు, స్వజనులు, వ్యాధులు, సాతాను, లోకము అన్ని ఆటంకములే. ఈ ప్రార్ధన చేయునప్పుడు ఈ ఆటంకములన్ని తొలగించుమని జ్ఞాపకముంచుకొని చేయవలయును.

2. మన శరీర జీవనమును గురించిన మనవి: 'మా దినాహారము నేడుమాకు దయచేయుము'. స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నము, వస్త్రము, గాలి, ఆరోగ్యము, విద్య, వృత్తి, గవర్నమెంటు, శరీరమునకు కావలసినవన్నియు దినాహారములోనివే. 'దినము' అనగా ఈ రోజునకు కావలసినవన్నియు, రోజుననే అడుగవలెను. రేపటికి, ఎల్లుండికి కావలసినవి ప్రభువు ఇస్తే మనము పుచ్చుకొన వచ్చును. గాని మనకు కావలసినవి ఏ దినమునకు ఆ దినమే అడుగవలెను. ఏ రోజు కారోజే ప్రార్ధించే విశ్వాసులమై మనము యుండవలెను. 'దయచేయుము' అనగా ఇమ్ము అని అర్ధము. ఇమ్ము అని అనగానే దేవుడిచ్చును గాని, అది మన చేతిలో లేక పోయినయెడల అది మనము పుచ్చుకొనలేదని అర్థము. ఇమ్ము అను మాటకు గ్రీకు భాషలో అర్థమేమనగా 'తండ్రీ! నీవు నాకు దాచి ఉంచినది ఇమ్ము' అని అర్థము. జార్జిముల్లరు దొరగారు రొట్టెల కొరకు ప్రార్థించినప్పుడు ప్రార్థన ముగించునప్పటికి, బండ్లలో రొట్టెలు వచ్చెను. అనగా ఆయన ప్రార్ధన మొదలు పెట్టకముందే, రొట్టెల బండ్లు బయలుదేరినవి.

ఈ ప్రార్థనలోని మనవి లోకములో ఎవరైనా చెప్పగలరా? ప్రభువు ప్రార్థనతో సమానమైన ప్రార్థన ఎవరైన అల్లగలరా? ఈ రెండు ప్రశ్నలు, క్రైస్తవులు ఒకప్పుడు ఇతరులపై పందెము వేసిరి. 1893 సం॥లో చికాగో పట్టణములో, అన్ని మతములవారు కలిసికొని స్నేహము కలిగియుండుటకు ఒక సభను పెట్టుకొనిరి, ఒకరిమతమును ఒకరు దూషింప కూడదనియు, ఎవరికి నచ్చినవి వారు బోధింప వచ్చునని తీర్మానించుకొనిరి. వారు సభను ముగించబోవునప్పుడు ప్రార్థనచేసి, ముగించవలెను. ఎవరిని ప్రార్ధన చేయుమనినా తక్కినవారికి అభ్యంతరము గనుక ప్రభువు ప్రార్థన ఎవరికిని అభ్యంతరముగా నుండదని అందరు కలిసి ఆ ప్రార్థన చేసిరి. ప్రపంచమంతటనున్న ప్రతినిధులందరు మొదటగా ఇచ్చట కలిసికొనిరి. సృష్టి ఆదినుండి ఈ ప్రార్థనను మొదటిసారిగా, అందరు కలిసి ప్రార్థించిరి.

3. మన ఆత్మీయ జీవనమును గురించిన మనవులు: a) “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము”. క్రైస్తవులలో ఎవరు ఇతరుల తప్పులు క్షమించరో, వారు నిజముగా క్షమాపణ పొందలేదన్నమాట. ఇది ప్రభువు ప్రార్థనలో మహా భయంకరమైన పాఠము. తాను క్షమాపణపొంది, ఇతరులను క్షమించనివారికి, బైబిలు గొంతుక పట్టుకొనునటువంటిది. ఇది గొప్ప ఆపదగల మనవి. 1) మనము దేవునిని క్షమించుమని కోరినప్పుడు 10 పాళ్ళు క్షమించుమని కోరుదుము గాని 8 లేక 9 పాళ్ళు క్షమించుమని కోరము. అట్లే మనము ఇతరులను సంపూర్తిగా క్షమించవలెను. 2) ఇతరులకు వారుచేసిన కీడునుగూర్చి చెప్పరాదు. 3) మనలో ఇతరులు చేసిన కీడునకు ఆయాసముంచుకొనరాదు. 4) వారు కనబడినప్పుడు వారుచేసిన కీడు జ్ఞప్తికి తెచ్చుకొనకూడదు. 5) మీరు ప్రార్థనచేయునప్పుడెల్ల పగవానిని క్షమించవలెను. 6) మనము క్షమాపణ కోరకపోయినను ప్రభువు క్షమించెను. ఇది చిత్రమైన సంగతి, శత్రువులను క్షమించెను. మనము ఇతరులను క్షమించలేని యెడల 'పరలోకపు తండ్రీ! అని ఆయనను పిలువనే కూడదు, నీ రాజ్యము వచ్చుగాక అని అనకూడదు. అప్పుడాయన నన్ను ఎందుకు పిలువవలెను? రాజ్యము జోలి నీకెందుకు? అని ఆయన అడుగును. 7) దేవుడు మనలను క్షమించినాడు గనుక మనము ఆయనకు ఋణస్థులము, గనుక మనము ఇతరులను క్షమించవలెను.

b) “మమ్ము శోధనలోనికి తేకుము”. శోధనలోనికి తేవద్దు అనగా అర్థమేమి? ప్రభువుకూడ కొన్ని మారులు మనలను శోధనలోనికి తీసికొని వచ్చునన్నమాట. ఆదాము, హవ్వలతో దేవుడు- 'మేలు కీడు తెల్పు వృక్షఫలములు తినవద్దు’ అని చెప్పెను. గాని హవ్వ తన హద్దు (circle) దాటి ముట్టినది, చూచి ఊరకుండిన బాగుండును కాని ముట్టినందున తినవలసి వచ్చెను. శోధనలు రెండు రకములు 1. పాప శోధన 2. విశ్వాసపరీక్ష శోధన. మొదటిది సైతాను పంపునది. రెండవది ప్రభువు రానిచ్చునది. పాప శోధనలోనికి తేకుండునట్లు మనము ప్రార్థన చేసికొనవలెను. దేవుడు చాలమారులు పాపములు క్షమించి, క్షమించి చివరకు క్షమించడు. ఇక కృప ఆగిపోవును. దేవుడు అట్టివ్యక్తిని నాశనమునకు అప్పగించి వేయును. ఆ మనిషి అధోలోకమునకు పోవును. ఇట్టి గతి యూదా ఇస్కరియోతునకు, కయీనునకు, సౌలునకు కలిగెను. క్షమాపణ కోరనివారును, తప్పు దిద్దుకొనని వారును నరకములోనికి పోవుదురు. ఒకానొకప్పుడు ఇట్టివారికి ప్రభువు శ్రమలు పంపి, వారు క్షమాపణ కోరుకొనునట్లు చేసి, వారిని రక్షించును. కొందరు పాపము చేయుచు, క్షమాపణ పొందుచు, మరల శోధనలో పడుచుందురు. ఇట్టి వారికి, పై వారికి కూడ ఈ మనవి అవసరము.

C) మన ఆత్మీయ జీవనమును గురించి చేయు మనవులలో మూడవది: “కీడు నుండి తప్పించుము”, పై చిక్కులన్ని కలిపి కీడు. దేవుని నామము పరిశుద్ధ పరచబడ- కుండుటకు గల ఆటంకములు, ఆయన రాజ్యము వృద్ధికాకుండుటకు గల అడ్డులు, ఆయన చిత్తము భూలోకములో నెరవేరకుండ చేయునవన్ని, మన ఋణస్థులను క్షమింపలేక పోవుట, శోధనలో పడుట మొదలగున వన్నియు కీడు అనబడును. మరణమా! నీ ముల్లెక్కడా? మరణమా! నీ విజయమెక్కడా? అని గలదు గాని మరణమా! నీ వెక్కడ! అని అనలేదు. గనుక మరణము ఉన్నది. కాబట్టి, మరణము యొక్క అధికారము నుండి, శక్తినుండి తప్పించుమని వాక్యములోనే గలదు. మరణము కూడ ఒక కీడు గనుక లోకములోనున్న ఈ కీడులన్నిటి నుండి మమ్ములను తప్పించి, పరలోకములో చేర్చుకొనుమని ఈ మనవియొక్క అర్థము.

III. స్తుతి: “రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవియైయున్నవి. ఆమేన్'. ప్రభువు సంఘమునకు, తమ కిష్టమైన మంచి పనులు చేసికొనుటకు అధికారము నిచ్చెను. సంఘము యేసు ప్రభువు వలన పొందిన స్వతంత్రతనుబట్టి, తన దృష్టికి ఏది యోగ్యమో అది చేయవచ్చును. గనుక సంఘము ఈ స్తుతిని ప్రభువు నేర్పిన ప్రార్ధనకు చేర్చినది. ఈలాగు సంఘము కలుపకూడదని కొందరు అనుచున్నారు. మరికొందరు సంఘమునకు ఆ మాత్రము స్వతంత్రత ఉండకూడదా! అనుచున్నారు. ఈ స్తుతి చేర్చుటలో తప్పులేదు. రాజ్యము- సర్వత్ర వ్యాపించుట, శక్తి- ఆయనలో నున్నదంతయు బయలుపర్చుట. ప్రభావము, తేజస్సు- ఇవన్ని ఆయనకే చెందును. 'ఆమేన్' చేసినచో, ప్రార్థన నెరవేరునుగాక అని కోరుదుము. ప్రభువుకూడ 'ఆమెన్' అనును. 'గాక' అనగా, కోరిక బయలుపర్చుట. నా క్రియలవల్ల, నా జీవితమువల్ల దేవుని రాజ్యము వచ్చును గాక. ఆయన నామము పరిశుద్ధ పరచబడును గాక! అనే అర్థముతో మనము ప్రభువు ప్రార్థన చెప్పవలెను.

Comments

Popular posts from this blog

దైవలక్షణముల స్తుతి (సంఘారాధనలోని స్తుతులు)

అనాది :- అనాది దేవా! సృష్టింపబడకుండ నీ యంతట నీవే ఉన్నావు , గనుక నీవు ముందే ఉండి , మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవన్నియు ముందే ఏర్పాటు చేసియున్నావు. గనుక నీకు మా వందనములు. అనంతము :- అనంత దేవా! నీవు ఎల్లప్పుడు ఉండువాడవు గనుక అంతములేని కాలము వరకు కావలసినవన్నియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమ :- ప్రేమవైయున్న తండ్రీ! నీవు ముగ్గురుగా (త్రిత్వముగా) బయలు పడకపోయిన , మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి యంతటిలోను కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుటకన్న నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువైయున్నది. మమ్మును కలుగజే సిన నీవు మమ్మును ప్రేమించక యింకేమి చేయుదువు! గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నియు ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమనుబట్టియే సహించుచు , శిక్షించుచు , క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసికొనను అన్నావు. గనుక నీకు వందనములు. పరిశుద్ధత :- పరిశుద్ధుడవైన జనకా! సర్వసృష్టిని , మానవుని , పరిశుద్ధముగానే చేసియున్నావు. పాపప్రవేశమును బట్టి మేము పాపులమైనను , నీ పరిశుద్ధతను బట్టి మరల మాకు పరి...

దైవలక్షణముల స్తుతి (సమర్పణ ప్రార్ధనలోని స్తుతులు)

  1. దేవా , తండ్రీ! నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రీ! అనుదినము మాకు కావలసినవన్నియు అందించుచున్న తండ్రీ! నా ప్రియుడవైన తండ్రీ! నా దేవా , నా ప్రభువా! పోషకుడా , నా రక్షకుడా , నా సర్వమా! నీ కనేక నమస్కారములు. తండ్రీ! సృష్టి మూలముగ మాత్రమేగాక , నీ కుమారుని మూలముగ కూడ నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీ కనేక వందనములు. నీ దానముల మూలముగాను , నీ సహింపు మూలముగాను , నీ నడిపింపు మూలముగాను , మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను , నాకు నీవు చూపుచున్న ప్రేమను త లంచుకొని నిన్ను స్తుతించుచున్నాను. గాని నా స్తుతి నీ ప్రేమ యెదుట యేమాత్రము ? నా అంతరంగమందున్న కృతజ్ఞత నీ అనంత ప్రేమ యెదుట యేమాత్రము ? నేను ఏదియు ముట్టుకొనక స్తుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము యెదుట మిక్కిలి స్వల్పమై ఉండును. ఆ స్వల్ప స్తుతులను కూడ హస్తార్పణముగ అందుకొనుచున్నావు. గనుక నీకు వందనములు. నీవు నన్ను నేటివరకు కాపాడుచు , నడిపించుచు , వృద్ధిలోనికి తీసికొనివచ్చుచున్న నీ శక్తిని తలంచుకొని స్తుతించుచు , యిక ముందునకు కూడ నా విషయములో యిట్టి కార్యములు చేయుచుందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. నా జీవితాంతమందు ...

రెండు ద్వారములు, మత్తయి 6:33 - (యం. దేవదాసు అయ్యగారి ఉపదేశము.) తేది 12 — 10 — 1958

రెండు ద్వారములబడి దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘము లోనికి రావలసినవారికి ఈ వాక్యమందు వర్తమానమున్నది. మన దేవాలయమునకున్నది ఒక ద్వారము. ఇక్కడ నిండి పోయినందువల్ల ఒక్కొక్క ఆదివారము వెనుక ద్వారము గుండా వచ్చి ఇక్కడ కూర్చుని వింటారు. వారుకూడా ఆరాధనలో పాల్గొంటారు. ఈ వాక్యమును విడదీసికొందాము. అందులో రెండు గొప్ప మాటలు ఉన్నాయి. (1) దేవుని రాజ్యము (2) ఆయన యొక్క నీతి దేవునియొక్క రాజ్యముగా దేవునియొక్క గవర్నమెంటు. ఈ గవర్నమెంటుకు ఆయనే రాజు. అయితే దేవుని రాజ్యమెక్కడ ఉన్నది ? మన హిందూ దేశము నేలే గవర్నమెంటు. రాజ్యము ఢిల్లీలో ఉన్నది. వారి రాజ్య ప్రవేశము హిమాలయమునుండి కన్యాకుమారి వరకు ఉన్నది. అలాగుననే దేవుని రాజ్యముకూడా నున్నది. ఇంగ్లండు దేశము వారికి వారి దేశమే వారి రాజ్యము. వారు ఇతర దేశములు కూడా గెలుచుకుంటే అది కూడా వారి రాజ్యమే. అలాగే జపాను వారున్నది జపాన్ రాజ్యము వారెక్కడైనా గెలుచుకుంటే అది వారి రాజ్యమే. అలాగుననే దేవునిరాజ్య మెక్కడ నున్నది ? అనేది ఒక గొప్ప ప్రశ్న. ప్రభువు 1. ఆయన రాజ్యమును వెదకమన్నారు. రాజ్య మెక్కడనున్నదో తెలియకపోతే ఎలాగు? ఎక్కడున్నదో చెప్పే వెనుకనున్నారు. మత్తయి 6 అధ్యాయములో...